
9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేస్తూ CBSE తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి క్లాస్ 9 విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు చదవాలనే CBSE సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, CBSE, NCERTలకు నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆ విధానంపై స్టే విధించేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీ సభ్యులుగా ఉన్న బెంచ్.. ఈ అంశంపై సమగ్ర సమాధానం ఇవ్వాలని కేంద్రం, CBSE, NCERTలను ఆదేశించింది. ముఖ్యంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాల సిద్ధతపై పూర్తి నివేదిక ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీకి సూచించింది.
పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులు మూడు భాషలు చదవాల్సి వస్తోందని, కానీ ఇంకా పాఠ్యపుస్తకాలే సిద్ధంగా లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఇది కేవలం విద్యా అంశం మాత్రమే కాదని, ఫెడరల్ నిర్మాణానికి సంబంధించిన కీలక రాజ్యాంగ అంశమని వాదించారు. భాష అనేది వ్యక్తిగత ఎంపిక అంశమని, దాన్ని బలవంతంగా రుద్దలేమని పేర్కొన్నారు.
మొదట ఈ కేసును జూన్ 15కు విచారణకు పెట్టాలని సుప్రీంకోర్టు భావించినా.. కేంద్రం తరఫు విజ్ఞప్తితో జూలై రెండో వారానికి వాయిదా వేసింది. ఈలోపు జూలై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున CBSE నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరినా.. కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వలేదు.
ఈ పిటిషన్‌ను ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, చెన్నై ప్రాంతాలకు చెందిన 19 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి దాఖలు చేశారు. మే 15, 2026న CBSE విడుదల చేసిన సర్క్యులర్‌ను వారు సవాలు చేస్తున్నారు. ఆ సర్క్యులర్ ప్రకారం.. 9వ తరగతి విద్యార్థులు R1, R2, R3 పేర్లతో మూడు భాషలు తప్పనిసరిగా చదవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలే ఉండాలి. ఫ్రెంచ్, జర్మన్ వంటి విదేశీ భాషలను చదవాలంటే వాటిని మూడో లేదా నాలుగో భాషగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఇదే CBSE ఏప్రిల్ 9న విడుదల చేసిన మరో ప్రకటనకు పూర్తిగా విరుద్ధమని పిటిషనర్లు చెబుతున్నారు. అప్పట్లో 2029-30 వరకు ఈ నిబంధనను అమలు చేయబోమని CBSE తెలిపిందని, దానిపై ఆధారపడి విద్యార్థులు, పాఠశాలలు ఇప్పటికే అకడమిక్ ప్లానింగ్ చేసుకున్నాయని వాదిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయం మార్చడం గందరగోళానికి దారితీసిందని పేర్కొన్నారు.
అదనంగా.. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత, పాఠ్యపుస్తకాల లేమి, తగిన బోధనా వ్యవస్థ లేకుండానే ఈ విధానాన్ని అమలు చేయడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని పిటిషన్‌లో ఆరోపించారు. ఫ్రెంచ్, జర్మన్ వంటి భాషలు ఎన్నో ఏళ్లుగా చదువుతున్న విద్యార్థులు ఒక్కసారిగా కోర్సు మార్చుకోవాల్సి రావడం వారి విద్యా ప్రగతిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
మరోవైపు జాతీయ విద్యా విధానం (NEP 2020)లో “ఏ భాషనూ ఎవరిపై రుద్దకూడదు” అని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని కూడా పిటిషనర్లు ప్రస్తావించారు. CBSE తాజా నిర్ణయం ఆ సూత్రాలకు విరుద్ధమని ఆరోపించారు.
ఇప్పుడు ఈ కేసుపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా CBSE పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వ్యవహారాన్ని దగ్గరగా గమనిస్తున్నారు.