Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ కేసును కొట్టివేసిన సుప్రీం కోర్టు

|

Oct 18, 2024 | 9:16 PM

జగ్గీవాసుదేవ్ నెలకొల్పిన ఈశా ఫౌండేషన్‌లో తన కుమార్తెలను బంధించారని ఆరోపిస్తూ.. కోయంబత్తూరు అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కామరాజ్.. మద్రాస్ హైకోర్టులో దాఖలుచేసిన రిట్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మూసివేసింది. హెబియస్ కార్పస్ రిట్‌పై విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించడం.. ఆశ్రమంలో పోలీసులు దాడులు చేయడం పూర్తిగా అనుచితమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ కేసును కొట్టివేసిన సుప్రీం కోర్టు
Sadhguru Jaggi Vasudev
Follow us on

ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ఈశా ఫౌండేషన్‌  ప్రేరేపిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు తోసిపుచ్చింది. ఈ ఫౌండేషన్‌పై నమోదైన కేసు విచారణను అత్యున్న న్యాయస్థానం క్లోజ్ చేసింది.  తమిళనాడులోని కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్‌ నిర్వహిస్తున్న ఈశా యోగా సెంటర్‌లో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్‌ కామరాజ్‌ మద్రాసు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో.. తన ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈశా యోగా సెంటర్‌లో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారన్నారు. తమ కుమార్తెలను రూమ్‌లో లాక్ చేసి… చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.

దీనిపై ఇటీవల విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. ఈశా యోగా కేంద్రంపై ఇప్పటి వరకు ఎన్ని క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు తమకు అందజేయాలని పోలీసులకు ఉత్తర్వులిచ్చింది. ఆశ్రమంలో ఉన్న అందరినీ విచారించాలని సూచించింది. దీంతో ఈశా ఫౌండేషన్‌.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం… హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. అనంతరం హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీం ధర్మాసనం ముందుకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంది. అలాగే ఆ స్టేటస్ రిపోర్టు వివరాలను తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం ఆదేశాల మేరకు పోలీసులు రిపోర్ట్ సమర్పించారు. ఆ ఇద్దరు యువతులను విచారించగా.. తమను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. చిత్ర హింసలు పెట్టలేదని… ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉన్నట్లు వారు చెప్పారని పోలీసులు అందులో పొందుపరిచారు. సుప్రీం విచారణ సందర్భంగా ఇద్దరు యువతుల్లో ఒకరు సుప్రీంకోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. పోలీసుల రిపోర్ట్ పరిశీలించిన ధర్మాసనం.. ‘‘వారిద్దరు మేజర్లు. వారి ఆచూకీ ఎక్కడుందో వివరంగా ఉంది. తమకు నచ్చిన కారణంతోనే ఆశ్రమంలో ఉన్నట్లు చెప్పారు. అందువల్ల హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం. ఇక, ఈ కేసులో హైకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు అవసరం లేదు’’ అని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

సుప్రీం నిర్ణయాన్ని హర్షించిన సదరు మహిళలు గీత, లత

సుప్రీం తీర్పు అనంతరం ఇషా ఫౌండేషన్ లాయర్ ముకుల్ రోహత్గీ ఏమన్నారో దిగువన చూడండి