
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతపై ఓ విద్యార్థి రూపొందించిన విజువల్ డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రేయా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంటున్న రాహుల్, థీసిస్‌లో భాగంగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. జైపూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న ఈ డాక్యుమెంటరీని శుక్రవారం ఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ప్రదర్శించారు.
థీసిస్‌లో భాగంగా ఏదైనా ఒక అంశంపై అధ్యయనం చేసి, వాటిని పుస్తకరూపంలో అందించాల్సి ఉంటుంది. అయితే రాహుల్ తాను ఎంచుకున్న అంశానికి పుస్తకరూపం కంటే విజువల్ డాక్యుమెంటరీ రూపంలో రూపొందిస్తేనే మరింత స్పష్టంగా తన అధ్యయన ఫలితాలను ప్రదర్శించవచ్చని భావించారు. ఈ క్రమంలో యూనివర్సిటీ అనుమతి తీసుకుని తానే సొంతంగా కెమేరాతో చిత్రీకరణ పూర్తిచేశారు. ఈ థీసిస్‌కు ప్రఖ్యాత చరిత్రకారులు ప్రొఫెసర్ రామచంద్ర గుహ, ప్రొఫెసర్ పృథ్వీ దత్తా శోభి సూపర్‌వైజర్లుగా వ్యవహరించారు. ఈ డాక్యుమెంటరీని యూనివర్సిటీ అత్యుత్తమ అధ్యయనాల్లో ఒకటిగా పేర్కొంటూ రాహుల్‌ను గోల్డ్ మెడల్‌తో సత్కరించింది. మరోవైపు రాహుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో స్కాలర్‌షిప్‌తో సహా అడ్మిషన్ ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కుమారుడే ఈ రాహుల్.
భావోద్వేగభరితం లఘుచిత్రం. భారతదేశంలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై ఈతరంలో చాలామందికి సరైన సమాచారం, అవగాహన లేదని.. వారందరికీ పుస్తక రూపంలో తెలియజేయడం కంటే వీడియో డాక్యుమెంటరీ రూపంలో మరింత బలంగా చెప్పవచ్చని భావించానని లఘుచిత్రం రూపకర్త రాహుల్ అన్నారు. నాడు జరిగిన ఘటనలకు సబంధించిన సమాచారాన్ని సేకరించడంతోనే సరిపెట్టకుండా, బాధితులతో ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఈ షార్ట్‌ఫిల్మ్ భావోద్వేగంతో నిండిపోయిందని తెలిపారు. తనకు చరిత్ర అంటే ఇష్టమని, వాటిపై తాను ఇకపై చేసే అధ్యయనాలు కూడా వీడియో డాక్యుమెంటరీ రూపంలోనే చేస్తానని రాహుల్ వెల్లడించారు.
భారతీయులు సిగ్గుపడాల్సిన దారుణమిది. సిక్కు వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ మారణకాండ చరిత్ర పేజీల్లో ఓ చీకటి అధ్యాయం అని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్. వెంకట్ నారాయణ్ అన్నారు. నాటి పాలకులు ప్రేరేపించి సృష్టించిన నరమేధంగా ఆయన అభివర్ణించారు. ఇది భారతీయులందరూ సిగ్గుపడాల్సిన దుర్ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాటి పరిస్థితిని కళ్లకు కట్టేలా లఘుచిత్రం రూపొందించిన రాహుల్‌ను ఆయన అభినందించారు. ఈ ఘటనను చాలామంది “1984 సిక్కు అల్లర్లు”గా పేర్కొంటున్నారని, కానీ ఇది ముమ్మాటికీ అల్లర్లు కాదని, సిక్కు వర్గం లక్ష్యంగా జరిగిన మారణకాండ అని పలువురు వక్తలు తెలిపారు.