Shashi Tharoor: సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఘన విజయం.. శశిథరూర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఏమన్నారంటే..

కేరళ సీఎం అభ్యర్ధిగా తనను ప్రకటిస్తే UDF కూటమి విజయం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. ముందు థరూర్‌ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. UDF కూటమి అధికారం లోకి వస్తే థరూర్‌ కాదు.. వేరేవాళ్లే సీఎం అవుతారని స్పష్టం చేశారు.

Shashi Tharoor: సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఘన విజయం.. శశిథరూర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఏమన్నారంటే..
Shashi Tharoor

Updated on: Jul 13, 2025 | 1:36 PM

కేరళ కాంగ్రెస్‌లో శశిథరూర్‌ వివాదం మరింత ముదిరింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో UDF కూటమి తరపున తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఘనవిజయం ఖాయమన్న థరూర్‌ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు కాంగ్రెస్‌ నేతలు . తాను సీఎం కావాలని 28.3 శాతం ప్రజలు కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలిందని ట్వీట్‌ చేశారు శశిథరూర్‌. అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేరళ కాంగ్రెస్‌ నేతలు.. ముందు ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటున్నారు.

శశిథరూర్‌ ముందు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలి

శశిథరూర్‌ ముందు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలన్నారు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మురళీధరన్‌. ఒకవేళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో UDF కూటమి గెలిస్తే సర్వేలో టాప్‌లో ఉన్న వ్యక్తి సీఎం కాబోరని , వేరే నేతే సీఎం అవుతారని స్పష్టం చేశారు. హైకమాండ్‌ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్‌ అధ్యక్ష పోటీలో నిలిచినప్పటికి నుంచి శశిథరూర్‌ తీరుపై గాంధీ కుటుంబం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముఖ్యమని, శశిథరూర్‌ వ్యాఖ్యలతో సంబంధం లేదని కేరళ కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

ప్రధాని మోదీని తరచుగా పొగడడం థరూర్‌కు అలవాటు మారిందన్నారు కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితల. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమటీ సభ్యుడిగా ఉన్న థరూర్‌ వ్యాఖ్యలతో దేశమంతా కాంగ్రెస్‌ కార్యకర్తలు బాధపడుతున్నారని అన్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో థరూర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారాయి. శశిథరూర్‌ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆయనపై త్వరలో వేటు వేస్తుందని అంటున్నారు. థరూర్‌ కూడా అదే కోరుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఆపరేషన్‌ సింధూర్‌తో పాటు విదేశాంగ విధానంలో ప్రధాని మోదీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు థరూర్‌.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి థరూర్‌ను ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రపంచదేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందంలో కేంద్రం పంపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..