
2024 General Elections: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై బీజేపీ సర్కారు కన్నేయగా.. ఆరునూరైనా మోదీ సర్కారును గద్దెదించాలని విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు అధికార, విపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పాట్నా వేదికగా జూన్ 23న ప్రతిపక్ష కూటమి సమావేశం జరగ్గా.. తదుపరి సమావేశాన్ని ఈ నెల 17,18 తేదీల్లో బెంగుళూరులో నిర్వహించనున్నారు. బీజేపీ సర్కారును గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఎన్డీయే పక్షాలు తమ ఐక్యతను చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్డీయే కూటమి సమావేశాన్ని జులై 18న నిర్వహించనుండగా.. దీనికి ఎన్డీయే పాత మిత్రులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి సాగనంపుతూ ప్రజలు తీర్పు ఇవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష కూటమి 300 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి.. అధికార పగ్గాలు చేపడుతుందన్నారు. అయితే ప్రతిపక్షాల నుంచి ఎవరు దేశ ప్రధాని అవుతారని లాలూ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. విపక్ష కూటమి తొలి సమావేశం గత నెల పాట్నాలో జరిగినట్లు గుర్తుచేసిన లాలూ.. తదుపరి సమావేశం బెంగుళూరులో జరగనుందని చెప్పారు. ఢిల్లీ వెళ్తూ పాట్నా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాల సమావేశానికి లాలూ హాజరు..
ఆర్డీడీ సహా 17 ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకే తాటి మీదకు వస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ సంతోషం వ్యక్తంచేశారు. విపక్ష కూటమిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన త్వరలోనే కుర్చీ దిగనున్నారు.. ఇప్పుడు ఏం మాట్లాడుతారో మాట్లాడనివ్వండి.. అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని రక్త పరీక్షల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఢిల్లీ నుంచి నేరుగా బెంగుళూరులో జులై 17, 18 తేదీల్లో జరిగే విపక్షాల కూటమి సమావేశానికి హాజరుకానున్నట్లు వెల్లడించారు.
భార్య లేని వ్యక్తి ప్రధానిగా వద్దు: లాలూ
కాగా పెళ్లి చేసుకోవాలని రాహుల్ గాంధీకి గత విపక్ష కూటమి సమావేశంలో సలహా ఇవ్వడంపై మీడియా ప్రశ్నకు లాలూ స్పందించారు. తదుపరి దేశ ప్రధానిగా ఎవరైనా..అయితే ఆయనకు భార్య లేకుండా ఉండొద్దని వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని భార్య లేకుండా ప్రధానమంత్రి భవనంలో బస చేయడం ప్రజలకు ఇబ్బందికరమని లాలూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.1000049
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..