PM Modi: ‘.. యాదృచ్చికమే! నవరాత్రికి ముందు రోజు మీ చేతి వంట అమ్మవారి ప్రసాదంలా చేరింది’ నీరజ్‌ చోప్రా తల్లికి ప్రధాని మోదీ లేఖ..

|

Oct 02, 2024 | 6:58 PM

పారిస్‌ ఒలింపిక్స్‌కి వెళ్లేముందు కూడా అథ్లెట్స్‌తో మోదీ సంభాషించారు. ఆ సమయంలో నీరజ్‌ తల్లి చేసిన చుర్మా తినాలని ఉందని మోదీ కోరారు. దీంతో తన చేతితో చేసిన చుర్మా పంపిస్తానని నీరజ్‌ తల్లి సరోజా దేవీ మోదీకి తెలిపారు. తాజాగా ఆమె తయారు చేసిన చుర్మాను ప్రధాని మోదీకి పంపించగా.. ఆయన ఆ స్వీట్‌ రుచికి ఫిదా..

PM Modi: .. యాదృచ్చికమే! నవరాత్రికి ముందు రోజు మీ చేతి వంట అమ్మవారి ప్రసాదంలా చేరింది నీరజ్‌ చోప్రా తల్లికి ప్రధాని మోదీ లేఖ..
PM modi letter to Neeraj Chopra mother
Follow us on

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 2: బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా తల్లికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. నీరజ్ చోప్రా తల్లికి ఇంట్లో తయారు చేసిన ‘చుర్మా’ రుచి అద్భుతంగా ఉందని, ఆమె చేతి వంటను ప్రశంశించారు. ఈ మేరకు బుధవారం మోడీ లేఖ రాశారు. అందులో ‘నీరజ్ ఈ చుర్మా గురించి నాతో చెప్పాడు. కానీ ఈరోజు అది తిన్న తర్వాత నేను భావోద్వేగానికి గురయ్యాను. మీ అపారమైన ప్రేమ, ఆప్యాయతతో నిండిన ఈ బహుమతి నాకు మా అమ్మను గుర్తు చేసింది. అమ్మ.. శక్తి, ఆప్యాయత, అంకితభావానికి ప్రతిరూపం. ఇది యాదృచ్ఛికం. నవరాత్రి పండుగకు ఒక రోజు ముందు నాకు ఈ అమ్మవారి ప్రసాదం లభించింది’ అని నీరజ్ చోప్రా తల్లికి రాసిన లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇంకా లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.. ‘నవరాత్రులలో 9 రోజులు నేను ఉపవాసం ఉంటాను. ఒకరకంగా మీరు తయారు చేసిన చూర్మ నా ఉపవాసానికి ముందు నా ప్రధాన ఆహారంగా మారింది. మీరు తయారుచేసిన ఆహారం రుచి చూశాక.. సోదరుడు నీరజ్‌కు దేశం కోసం పతకాలు సాధించే శక్తిని ఎలా వస్తుందో అర్ధమైంది. అదే విధంగా ఈ చూర్మ శక్తి నవరాత్రుల సందర్భంగా దేశానికి సేవ చేయడానికి నాకు బలాన్ని ఇస్తుంది. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే నా సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి నేను మరింత అంకితభావంతో పని చేస్తానని హామీ ఇస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని మోదీ లేఖలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

పారిస్‌ ఒలింపిక్స్‌ పోటీలు ముగిసిన తర్వాత భారత్‌కు వచ్చిన అథ్లెట్లను స్వాతంత్ర్య వేడుకల అనంతరం ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. అథ్లెట్ల బృందాన్ని మోదీ అభినందించారు. ఇక పారిస్‌ ఒలింపిక్స్‌కి వెళ్లేముందు కూడా అథ్లెట్స్‌తో మోదీ సంభాషించారు. ఆ సమయంలో నీరజ్‌ తల్లి చేసిన చుర్మా తినాలని ఉందని మోదీ కోరారు. దీంతో తన చేతితో చేసిన చుర్మా పంపిస్తానని నీరజ్‌ తల్లి సరోజా దేవీ మోదీకి తెలిపారు. తాజాగా ఆమె తయారు చేసిన చుర్మాను ప్రధాని మోదీకి పంపించగా.. ఆయన ఆ స్వీట్‌ రుచికి ఫిదా అయ్యారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘చుర్మా’ స్వీట్‌ చాలా స్పెషల్. దీన్ని అక్కడి స్థానికులు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.