పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్ రహస్యాలు

జగన్నాథ ఆలయ రత్న భండార్ లోపల ఏముంది..? ఎంత నిధి ఉంది? ఈ ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకనుంది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ రూపొందించిన SOP ప్రకారం.. రథయాత్ర లోపు నిధి లెక్కింపు పూర్తి కానుంది. భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఈ చారిత్రక ఘట్టాన్ని నిర్వహించనున్నారు.

పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్ రహస్యాలు
Ratna Bhandar Ornaments Inventory

Updated on: Dec 28, 2025 | 9:49 AM

ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం రత్న భండార్‌లోని ఆభరణాలు, విలువైన వస్తువుల లెక్కింపు ప్రక్రియపై కీలక అడుగు పడింది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ శనివారం నిర్వహించిన సమావేశంలో జాబితా తయారీ కోసం ముసాయిదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వచ్చే ఏడాది రథయాత్రకు ముందే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మూడు దశల్లో లెక్కింపు ప్రక్రియ

ఆలయ ముఖ్య నిర్వాహకురాలు అరబింద పాధీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ లెక్కింపు మొత్తం మూడు దశల్లో జరగనుంది.

మొదటి దశ: స్వామివారి రోజువారీ ఆచారాలకు ఉపయోగించే విలువైన వస్తువుల జాబితా తయారీ.

ఇవి కూడా చదవండి

రెండవ దశ: రత్న భండార్ బయటి గదిలోని ఆభరణాల లెక్కింపు.

మూడవ దశ: రత్న భండార్ లోపలి గదిలో దాచిన నిధి నిల్వల లెక్కింపు.

1978 నాటి రికార్డులతో పోలిక

ప్రస్తుతం లెక్కిస్తున్న ఆభరణాలను 1978లో రూపొందించిన పాత జాబితాతో పోల్చి చూడనున్నారు. దీనివల్ల గత 46 ఏళ్లలో నిధిలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగాయా అనే విషయం స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు, ఎస్బీఐ అనుబంధ స్వర్ణకారుల సహాయం తీసుకోనున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయనున్నారు.

భక్తులకు ఆటంకం లేకుండా..

“ఈ భారీ లెక్కింపు ప్రక్రియ వల్ల స్వామివారి నిత్య కైంకర్యాలకు లేదా భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని అరబింద పాధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధమైన ముసాయిదా SOPని ఆలయ నిర్వహణ కమిటీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదించగానే ఖచ్చితమైన తేదీలను ప్రకటిస్తారు.

46 ఏళ్ల తర్వాత చారిత్రక ఘట్టం

12వ శతాబ్దపు ఈ పురాతన ఆలయంలోని రత్న భండార్‌ను తెరిచి లోపలి వస్తువులను అంచనా వేయాలని దశాబ్దాలుగా డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 46 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జూలై 2024లో దీనిని తెరిచారు. 2025 జూలై నాటికి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన నిర్మాణ మరమ్మతులను పూర్తి చేసింది. అనంతరం తాత్కాలిక గదుల్లో భద్రపరిచిన నిధిని తిరిగి సెప్టెంబర్‌లో పునరుద్ధరించిన రత్న భండార్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..