
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగు దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్ 2) పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పొరుగు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా భారతదేశంపై దుస్సాహసానికి పాల్పడవచ్చన్నారు. ఒకవేళ పాకిస్థాన్ అలా చేయడానికి సాహసిస్తే, భారతదేశం తీసుకునే చర్య అపూర్వమైనదిగా, నిర్ణయాత్మకమైనదిగా ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ దేశంలో ఇంధన లేదా గ్యాస్ సంక్షోభం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి ఇంధన సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకాదళం ట్యాంకర్లను సురక్షితంగా రవాణా చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, భారతదేశ ప్రయోజనాలను కాపాడటానికి ప్రధానమంత్రి దౌత్య నైపుణ్యాలను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.
“గత 11 ఏళ్లుగా, అంతర్గత భద్రత అయినా, బాహ్య శత్రువుల నుంచి రక్షణ అయినా, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం జాతీయ భద్రతను బలోపేతం చేసింది” అని రక్షణ మంత్రి అన్నారు. “కేవలం ఉగ్రవాదం గురించే మాట్లాడుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతిరోజూ ఉగ్రవాద ఘటనలు, పలు నగరాల్లో బాంబు పేలుళ్లు జరిగేవి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాద ఘటనలను అరికట్టడమే కాకుండా, ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు కూడా తీసుకున్నాము.” అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, “ఉరి దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్ అయినా, పుల్వామా తర్వాత జరిపిన వైమానిక దాడి అయినా, లేదా పహల్గామ్ ఘటన తర్వాత ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అయినా, ఉగ్రవాదంపై భారీ దాడిని ప్రారంభించాము.” ఆయన అన్నారు. “పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద ఘటన తర్వాత , ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనికులు కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌ను మోకరిల్లేలా చేశారు. ఇది భారత సైనిక చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్.” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.
Addressing a ‘Sainik Samman Sammelan’ at Thiruvananthapuram. https://t.co/pFSgTYnmI4
— Rajnath Singh (@rajnathsingh) April 2, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..