Watch Video:హెలికాప్టర్‌లో వెళ్లి పరీక్ష రాసిన విద్యార్థులు.. అది కూడా పక్క రాష్ట్రానికి.. ఎందుకంటే?

సాధారణంగా మనం ఏదైనా పరీక్ష రాయాలంటే ఏం చేస్తాం.. హాల్ టికెట్, పెన్ను లాంటి వస్తువులను వెంటబెట్టుకుని సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్లిపోతాం. కాస్త దూరంలో ఉన్న కేంద్రానికి అయితే ప్రైవేట్ వాహనమో లేదా బస్సు, ఆటోలాంటి వాటిని ఆశ్రయిస్తాం. కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సంఘటనలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళ్లడానికి ఏకంగా హెలికాప్టర్‌ను ఎంచుకున్నారు. ఏంటి.. పరీక్ష కోసం హెలికాఫ్టరా..? అని ప్రతి ఒక్కరూ మీలాగే ఆశ్చర్యపోయారు. ఎంచుకున్నారు అనే కన్నా అలా చేయడానికి ఆ విద్యార్థులకు అంతటి అవసరం ఏర్పడింది మరి. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Watch Video:హెలికాప్టర్‌లో వెళ్లి పరీక్ష రాసిన విద్యార్థులు.. అది కూడా పక్క రాష్ట్రానికి.. ఎందుకంటే?
Rajasthan News

Edited By: Anand T

Updated on: Sep 08, 2025 | 5:31 PM

రాజస్థాన్ రాష్ట్రంలో బాలోత్రా అనే నగరంలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నేవరి నివాసి ఒమారాం చౌధరి, సిణధరి నివాసి మగారం చౌధరి, బాంకియావాస్‌కు చెందిన ప్రకాశ్ చౌధరి, గిడా గ్రామానికి చెందిన లక్కీ చౌధరి అనే ఈ నలుగురు విద్యార్థులు ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీలో B.Ed చదువుతున్నారు. ప్రస్తుతం వీరందరూ గ్రేడ్–III టీచర్‌లుగా పని చేస్తున్నారు. అయితే.. చివరి సెమిస్టర్ పరీక్ష కేంద్రం మునస్యారి (RS టోలియా PG కాలేజ్)లో ఉంది. ఇది హల్ద్వానీ నుంచి సుమారు 300 కి.మీ దూరంలో ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే భారీ వర్షాలు, వరదల వల్ల మునస్యారికి వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరీక్ష రాయడానికి సిద్ధమైన ఈ నలుగురు విద్యార్థులు ఈ వరదల్లో కేంద్రానికి ఎలా వెళ్లాలనే దానిపై ఆలోచనలో పడ్డారు. పరీక్ష రాయలేకపోతే ఒక సంవత్సరం వృథా అవుతుందని మొదట తీవ్ర ఆందోళన చెందారు. ఏ కాస్త అవకాశం ఉన్నా వెళ్లాల్సిందేనని అందుకోసం ఉన్న దారులన్నిటిపై ఆరా తీశారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఏ దిక్కు తోచకపోవడంతో చేసేది లేక ఆ విద్యార్థులు ఏకంగా హెరిటేజ్ ఏవియేషన్ CEOని సంప్రదించారు. తమ అవసరాన్ని చెప్పి ఎలాగైనా పరీక్ష రాసేందుకు వెళ్లాలని, వీలైనంత సాయపడాలని కోరారు. ఏముంది.. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఏకంగా హెలికాఫ్టరే వచ్చింది.

హెరిటేజ్ ఏవియేషన్ CEO చొరవతో ఓ ప్రత్యేక హెలికాప్టర్, ఇద్దరు పైలట్లను పంపించారు. రోడ్డు మార్గంలో వెళ్తే 10 గంటలు పట్టే ప్రయాణాన్ని వీరు కేవలం 40 నిమిషాల్లో పూర్తి చేశారు. చదువు పట్ల, భవిష్యత్తు పట్ల ఇంత ఆసక్తిగా ఉన్న విద్యార్థుల ప్రయత్నాన్ని చూసి చుట్టూ ఉన్నవారంతా అభినందించారు. పరీక్షలంటేనే భయపడిపోయే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఆలోచనపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

కాగా, హెలికాప్టర్‌లో వెళ్లి పరీక్ష రాసినందుకు గాను ఒక్కొక్క విద్యార్థి రూ.5,200 చెల్లించగా.. రాకపోకలతో కలిపి మొత్తం రూ.10,400 ఖర్చయింది. దీనిపై ఆ నలుగురు విద్యార్థులు స్పందిస్తూ.. “మేం మొదట పరీక్ష రాయలేమేమోనని, ఒక ఏడాది వృథా అవుతుందేమోనని చాలా భయపడ్డాం. భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలకు అడ్డంకి ఏర్పడుతుందని చాలా నిరాశకు గురయ్యాం. కానీ, సకాలంలో హెలికాప్టర్ సాయం వల్ల సమయానికి పరీక్ష రాయగలిగాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు” అని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.