
మేఘాలయాలో రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ లాగే రాజస్థాన్‌లో హనీమూన్ మర్డర్ సంచలనం రేపుతోంది. శ్రీ గంగానగర్‌లో ఆశిష్-అంజు అనే నవదంపతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆశిష్ స్పాట్‌లో చనిపోయారు. గాయాల పాలైన అంజు నుంచి నగలు దోచుకెళ్లారు దుండగులు. అయితే ఇదంతా డ్రామా అని పోలీసుల దర్యాప్తులో తేలింది. భర్త ఆశిష్‌ను అంజునే మర్డర్ చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. తన బాయ్‌ఫ్రెండ్ సంజుతో కలిసి ఆశిష్‌ను హత్య చేసినట్టు గుర్తించారు. గతంలో మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్‌కు దీనికి దగ్గరి పోలీకలు ఉన్నాయి. ఈ కేసులో రఘవంశీ భార్య సోనమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితమే ఆశిష్- అంజుల పెళ్లి జరిగింది. అంజు స్టేట్‌మెంట్‌పై అనుమానాలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. వివాహం జరిగిన మూడు నెలలకే.. పెళ్లికూతురు, తన ప్రేమికుడితో కలిసి, తన భర్త జీవితాన్ని అంతం చేసింది. ముందు రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ.. పెళ్లి రోజున పన్నిన హత్యా కుట్రగా తేలింది.
జనవరి 30వ తేదీ రాత్రి గంగానగర్‌లోని రావల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రహదారిపై 25 ఏళ్ల ఆశిష్ మృతదేహం కనిపించింది.. ఈ సమయంలో అతని భార్య అంజు ఏడుస్తూ, దానిని “హిట్ అండ్ రన్” గా పేర్కొంది. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, దొంగలు తన నగలను దొంగిలించారని అంజు పేర్కొంది. అయితే, గంగానగర్ పోలీస్ సూపరింటెండెంట్ అమృత దుహాన్ చేసిన సాంకేతిక దర్యాప్తు పూర్తిచేసి.. ఇది హత్యగా వెల్లడించారు. పోలీసులు ఆధారాలను పరిశీలించినప్పుడు, ఇది ప్రమాదం కాదని “హనీమూన్ హత్య” అని వెల్లడైంది.
దర్యాప్తులో 23 ఏళ్ల అంజు తన వివాహం పట్ల అసంతృప్తిగా ఉందని తేలింది. ఆమె తన ప్రియుడు కావాలని కోరుకుంది. వివాహం తర్వాత ఆమె తల్లిదండ్రుల ఇంటికి (సాదుల్‌షహర్) తిరిగి వచ్చినప్పుడు, ఆమె అతనితో తిరిగి కనెక్ట్ అయ్యింది. హత్య కుట్ర మొత్తం సాదుల్‌షహర్‌లో జరిగింది. కుట్రలో భాగంగా, అంజు తన అత్తమామల ఇంటికి తిరిగి వచ్చి తన భర్త ఆశిష్‌పై ప్లాన్ ను అమలు చేసింది. ఆశిష్ సామర్థ్యం తెలుసుకునేందుకు.. రాత్రి భోజనం తర్వాత నడకకు తీసుకెళ్లేది.. అలా మొత్తం అతని గురించి తెలుసుకుంది..
జనవరి 30వ తేదీ రాత్రి, అంజు ఉద్దేశపూర్వకంగా అతన్ని రోడ్డుపైకి తీసుకెళ్లింది. అక్కడ, చీకటిలో, సంజు తన ఇద్దరు సహచరులు.. రాకీ అలియాస్ రోహిత్, బాదల్ అలియాస్ సిద్ధార్థ్ – తో కలిసి పొదల మాటున కూర్చొని ఉండి.. అకస్మాత్తుగా దాడి చేశారు.
ఆ జంట ఒక ఏకాంత ప్రదేశానికి చేరుకున్న వెంటనే, దాడి చేసిన వారు ఆశిష్ పై దాడి చేశారు. ఆశిష్ స్పృహ కోల్పోయే వరకు కొట్టి, ఆపై దారుణంగా గొంతు కోసి చంపారు. ఈ కుట్రకు మరింత బలం చేకూర్చేందుకు, పోలీసులు దానిని దోపిడీ లేదా ప్రమాదంగా పరిగణించాలని.. అంజు స్వయంగా సంజుకు తన మొబైల్ ఫోన్, చెవిపోగులు ఇచ్చింది. సంఘటన తర్వాత, అంజు రోడ్డుపై స్పృహ కోల్పోయినట్లు నటించింది.. దీనితో ఆమె బాధితురాలు.. అని అందరూ మొదట్లో నమ్మారు.
హంతకుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా, వారు ఎదో ఒక ఆధారాలు వదిలివేస్తారు. నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు, పోలీసులకు అనుమానం వచ్చిందని పోలీసు సూపరింటెండెంట్ అమృత దుహాన్ అన్నారు. వైద్య నివేదిక ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది.. ఆశిష్ శరీరంపై గాయాలు ప్రమాదంలో కాదు, దాడిగా ఉన్నాయని, అతను గొంతు కోసి చంపబడ్డాడని తేలింది.. అంజు ఫోన్ అత్యంత ముఖ్యమైన సాక్ష్యంగా మారింది. ఈ సంఘటనకు ముందు ఆమె తన ప్రేమికుడు సంజుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.. అంజు తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది.
సాంకేతిక నైపుణ్యం, FSL బృందం సహాయంతో, గంగానగర్ పోలీసులు ఈ హత్య కేసును కొన్ని రోజుల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితురాలు, భార్య అంజు, ఆమె ప్రేమికుడు సంజు, వారి ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. మూడు నెలల వివాహ బంధం.. ఇలా ముగియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు.