మూడేళ్ల బాలికను కాపాడేందుకు సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. 10 రోజుల తర్వాత ఎట్టకేలకు వెలికితీశారు. అనంతరం హుటాహుటిన చిన్నారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే తల్లితండ్రుల పూజలు, బంధువుల ఎదురుచూపులు, విపత్తు నిర్వహణ సిబ్బంది 10రోజుల కష్టం ఇవేవీ ఆ చిన్నారిని కాపాడలేకపోయాయి. చిన్నారి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. కోఠ్‌పుత్లీ జిల్లాలోని కిరాట్‌పుర గ్రామానికి చెందిన మూడేళ్ల చేతన డిసెంబరు 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. దీంతో చేతనను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
బాలిక మొదట 15 అడుగుల లోతులోనే చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు రక్షించేందుకు యత్నించగా మరింత కిందకు జారుకుంది. అలా 170 అడుగుల లోతులో పడిపోయిన చిన్నారిని హుకప్టెక్నిక్తో బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. అది విఫలం కాకపోవడంతో బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వుతుండగా వారికి పెద్ద బండ రాయి అడ్డు తగిలింది.
దీంతో పాపను రక్షించేందుకు పైప్‌ల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంపించడంతోపాటు.. కెమెరాల్లో బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు అందరిని కంటతడి పెట్టించాయి. చివరకు 10రోజుల తర్వాత చిన్నారని బయటకు తీసుకువచ్చారు. అయితే 170 అడుగుల లోతులో 10 రోజులు మృత్యువుతో పోరాడి ఓడింది. కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన చిన్నారి.. ఇక లేదని తెలిసి.. ఆ తల్లిదండ్రుల హృదయం తల్లడిల్లింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..