రియల్ హీరోకు శతకోటి వందనాలు, రైలు కింద పడబోయిన చిన్నారిని రక్షించిన ఉద్యోగికి ప్రశంసలు

| Edited By: Anil kumar poka

Apr 20, 2021 | 12:33 PM

ముంబైలో ని వంగానీ రైల్వే స్టేషన్ లో ఈ నెల 17 న సాయంత్రం రైలు కింద పడబోయిన చిన్నారిని రక్షించిన ఉద్యోగి మయూర్ షేక్ ని రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. 

రియల్ హీరోకు శతకోటి వందనాలు, రైలు కింద పడబోయిన చిన్నారిని రక్షించిన ఉద్యోగికి ప్రశంసలు
Railways Hero Seen Saving Boy From Train Gets Rousing Welcome In Mumbai
Follow us on

ముంబైలో ని వంగానీ రైల్వే స్టేషన్ లో ఈ నెల 17 న సాయంత్రం రైలు కింద పడబోయిన చిన్నారిని రక్షించిన ఉద్యోగి మయూర్ షేక్ ని రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.  తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అత్యంత ధైర్య సాహసాలతో పరుగు పరుగున వెళ్లి ఆ బాలుడిని  రక్షించిన ఇతడిని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కొనియాడారు.పాయింట్స్ మన్ గా పని చేసే షేక్ ని ఇతని సహోద్యోగులు తమ డిపార్ట్ మెంట్ కి ఈయన కీర్తి ప్రతిష్టలు తెచ్చాడని అభినందించారు. (ముంబై నుంచి ఈ రైల్వే స్టేషన్ 90 కి.మీ. దూరంలో ఉంది).  ఓ మహిళతో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తూ ఈ చిన్నారి పట్టు తప్పి కింద  పట్టాలపై పడిపోయాడు. తిరిగి ప్లాట్ ఫామ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. అదే సమయంలో సబర్బన్ రైలు అతి వేగంగా ఆ పట్టాలపై దూసుకువస్తోంది. ఇది గమనించిన  మయూర్ షేక్ పరుగున వెళ్లి ఆ బాలుడ్ని ఎత్తుకుని ప్లాట్ ఫామ్ పైకి చేర్చాడు. ఆ సమయంలో అతగాడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా తనతో బాటు ఆ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయేవాడే ! ఇతని సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు  సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఓ పసిబాలుడి ప్రాణాలు కాపాడావు.. నువ్వు నిజంగా  హీరోవి’ అని  రైల్వేశాఖ ఉన్నతాధికారులు నిన్న ప్రత్యేకంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మయూర్ షేక్ ని పొగిడారు. కాగా ఆ బాలుడి వెంట ఉన్న మహిళకు చూపు  సరిగా కనిపించదని, తన చిన్నారి రైలు పట్టాలపై పడిపోగానే ఆమె రక్షించాలంటూ కేకలు పెట్టిందని మయూర్ షేక్ తెలిపాడు. ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని, తన ప్రాణాలు పోయినా సరే.. ఆ చిన్నారిని రక్షించేందుకు పరుగున వెళ్లానని ఆయన చెప్పాడు.  అటు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ కూడా ఈయనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.