ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే స్టేషన్లలోని ఆ నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా! తాగొద్దు.. తాకొద్దు..

రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యంపై CAG నిర్వహించిన ఆడిట్‌లో పలు లోపాలు బయటపడ్డాయి. 512 స్టేషన్లలో 458 చోట్ల కనీస సౌకర్యాలు నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని నివేదిక తెలిపింది. హైదరాబాద్‌ సహా పలు స్టేషన్లలో వాటర్‌ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో E. coli బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. 59 స్టేషన్లలో తాగునీటికి బ్యాక్టీరియాలజికల్‌ పరీక్షలు నిర్వహించలేదని CAG వెల్లడించింది. రైల్వే శాఖ తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించింది..

ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే స్టేషన్లలోని ఆ నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా! తాగొద్దు.. తాకొద్దు..
Drinking Water At Railway Stations

Updated on: Aug 16, 2026 | 11:32 AM

న్యూఢిల్లీ, ఆగస్ట్ 16: దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (CAG) నిర్వహించిన ఆడిట్‌లో పలు కీలక లోపాలు బయటపడ్డాయి. రైల్వే స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు, ఫ్యాన్లు, నీటి కుళాయిలు వంటి కనీస ప్రయాణికుల సౌకర్యాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ఆగస్టు 12న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. CAG ‘Passenger Amenities and Sanitation at Non-Suburban Railway Stations in Indian Railways’ పేరుతో ఈ నివేదికను రూపొందించింది. దేశంలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలోని 512 నాన్-సబర్బన్ గ్రేడ్ రైల్వే స్టేషన్లను పరిశీలించి ఆడిట్ నిర్వహించింది.

తాగునీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా

రైల్వే స్టేషన్లలో తాగునీటి నాణ్యతపై నిర్వహించిన పరీక్షల్లో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆరు జోన్ల పరిధిలోని 59 స్టేషన్లలో తాగునీటికి బ్యాక్టీరియాలజికల్‌ విశ్లేషణే నిర్వహించలేదని CAG పేర్కొంది. కొన్ని స్టేషన్లలో వాటర్‌ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో E. coli ఉన్నట్లు గుర్తించారు. వీటిలో సదరన్‌ రైల్వే పరిధిలోని కోయంబత్తూరు, పాలక్కాడ్‌ జంక్షన్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో హైదరాబాద్‌, సెంట్రల్‌ రైల్వే పరిధిలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌, భివాండీ రోడ్‌, కల్యాణ్‌, లోణావాలా, ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని మధుపూర్‌ స్టేషన్లు ఉన్నాయి. అలాగే 2022-23లో ఎనిమిది జోన్లలోని 49 స్టేషన్లు, 2023-24లో తొమ్మిది జోన్లలోని 56 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో టోటల్‌ కాలిఫార్మ్‌ బ్యాక్టీరియా, అందులో E. coli కూడా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

89 శాతం స్టేషన్లలో కనీస సౌకర్యాల లోపం

ఆడిట్‌ చేసిన 512 స్టేషన్లలో ఏకంగా 458 స్టేషన్లు (89 శాతానికి పైగా) కనీస అవసరమైన సౌకర్యాల (Minimum Essential Amenities – MEA) విషయంలో లోపాలతో ఉన్నట్లు CAG తెలిపింది. కొన్ని స్టేషన్లలో ఈ సౌకర్యాలు పూర్తిగా లేకపోగా, మరికొన్ని చోట్ల నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొంది. 2018 ఏప్రిల్‌లో రైల్వే బోర్డు NSG-1 నుంచి NSG-6 వరకు స్టేషన్లకు కనీస, సిఫార్సు చేసిన, కావాల్సిన సౌకర్యాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని స్టేషన్లలో కనీస అవసరమైన సౌకర్యాలను 2018 ఆగస్టు 31లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కనీస సౌకర్యాల్లో తాగునీరు, వెయిటింగ్‌ హాళ్లు, సీటింగ్‌, ప్లాట్‌ఫామ్‌ షెల్టర్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఎత్తైన ప్లాట్‌ఫామ్‌లు, ఫ్యాన్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, డస్ట్‌బిన్లు, గడియారాలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ తదితరాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

CSMT, న్యూఢిల్లీ వంటి ప్రధాన స్టేషన్లలోనూ లోపాలు

NSG-1 కేటగిరీలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (CSMT), హౌరా, సీల్దా, న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్‌ వంటి ప్రముఖ స్టేషన్లలో కూడా ప్రయాణికుల సౌకర్యాల్లో లోపాలను CAG గుర్తించింది. ముఖ్యంగా సీటింగ్‌ ఏర్పాట్లు, శానిటరీ సదుపాయాలు, డస్ట్‌బిన్లు, ఎలక్ట్రానిక్‌ రైలు సూచిక బోర్డులు వంటి వాటిలో లోపాలు ఉన్నట్లు తెలిపింది. NSG-1 స్టేషన్ల పరిశీలనలో 12 స్టేషన్లలో తాగునీటి కుళాయిలు, ఎనిమిది స్టేషన్లలో ఫ్యాన్లు, మరో ఎనిమిది స్టేషన్లలో వాటర్‌ కూలర్లు, ఐదు స్టేషన్లలో సైన్‌బోర్డులు కొరతగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. Passenger Amenities Management System వివరాలను విశ్లేషించిన CAG.. వివిధ సౌకర్యాల్లో భారీ కొరతను గుర్తించింది. 201 స్టేషన్లలో మరుగుదొడ్లు, 403 స్టేషన్లలో మూత్రశాలలు, 2,035 స్టేషన్లలో తాగునీటి కుళాయిలు నిర్దేశిత ప్రమాణాల మేరకు లేవని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5,908 నాన్-సబర్బన్ గ్రూప్ (NSG) రైల్వే స్టేషన్లు ఉన్నాయని CAG నివేదిక వెల్లడించింది. 2023-24లో భారతీయ రైల్వేలు రోజుకు 7,424కు పైగా నాన్-సబర్బన్ ప్యాసింజర్‌ రైళ్లను నడిపాయని, ఆ ఏడాది 292.4 కోట్ల మంది నాన్-సబర్బన్ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారని పేర్కొంది.

నీటి నాణ్యతపై కఠిన పరీక్షలు చేయాలి.. CAG

రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందించే నీటి నాణ్యతపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని CAG సూచించింది. నీటి సరఫరా వ్యవస్థలను తనిఖీ చేసేందుకు నిర్దేశించిన ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, Uniform Drinking Water Quality Protocolలో పేర్కొన్న అన్ని ప్రమాణాలతో తాగునీటి సమగ్ర పరీక్షలు నిర్వహించాలని రైల్వే శాఖను కోరింది. 2019-20 నుంచి 2023-24 వరకు నిర్వహించిన టెస్ట్‌ ఆడిట్‌లో గుర్తించిన అంశాలతో పాటు, గతంలో గుర్తించినప్పటికీ నివేదించని కొన్ని కేసులను కూడా ఈ నివేదికలో CAG ప్రస్తావించింది. మొత్తంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కనీస సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీటి నాణ్యతపై రైల్వే శాఖ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us