
శోభనం గదిలా డెకరేట్ చేసుకుని రైల్లో ఓ జంట హనీమూన్ సెటప్ ఏర్పాటు చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది రైల్వేశాఖ దృష్టికి వెళ్లడంతో డ్యూటీలో ఉన్న టీటీఈని రైల్వేశాఖ సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా ట్రైన్లలో ఇలా ఏర్పాట్లు చేసుకోవడం నిబంధనలకు విరుద్దమన్న రైల్వేశాఖ.. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టీటీఈపై చర్యలు తీసుకుంది. ఈ నెల 6వ తేదీన బల్లార్షా నుంచి ముంబై వెళుతున్న నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ నూతన జంట ఏసీ బోగీలోని తమ క్యాబిన్‌ను శోభనం గది తరహాలోనే డెకరేషన్ చేసుకున్నారు. జల్నాకు చెందిన దంపతులు ఔరంగాబాద్ నుంచి జల్నా రైల్వే స్టేషన్‌కు కారులో రాగా.. ఆలోపే రహత్ రూమ్ డెకరేషన్ నిర్వాహకులు క్యాబిన్‌ను డెకరేట్ చేశారు. అనుమతి లేకుండా రైల్లో ఇలా చేయడం, టీటీఈ పట్టించుకోకపోవడంపై రైల్వేశాఖ సీరియస్ అయింది.
ఈ ఘటన మరవకముందే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కదులుతున్న ట్రైన్లో హోం నిర్వహిస్తున్నారు. ఇందులో తెల్లబట్టలు వేసుకుని కొంతమంది పూజలో కూర్చోని ఉండగా.. పూజారి మధ్యలో ఉండి మంత్రాలు చదువుతున్నట్లు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. రైల్వేశాఖ స్పందించి వివరణ ఇచ్చింది. హోమం జరిగింది సాధారణ రైల్వే కాదని, ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా ప్రత్యేకంగా బుక్ చేసుకున్న సెలూన్ కార్ బోగీలో అని స్పష్టం చేసింది. కొంతమంది వీవీఐలు డబ్బులు చెల్లించి ఈ కంపార్ట్‌మెంట్‌ను ప్రత్యేకంగా బుక్ చేసుకుంటారు. ఈ బోగీలో హోటల్ తరహాలో కిచెన్, వాష్ రూమ్స్, ఏసీ బెడ్ రూమ్స్, డైనింగ్ రూమ్ వంటివి ఉంటాయి.
ఈ ఘటనపై రైల్వేశాఖ స్పందించింది. “సెలూన్ కారును ఈ నెల 8న IRCTC ద్వారా బుక్ చేశారు. సంబంధిత టీమ్ బుకింగ్ కింద రూ. 3,08,580 అడ్వాన్స్ చెల్లించింది. ఈ సెలూన్ కారును ఈ నెల 10న న్యూఢిల్లీ నుండి ముంబైకి వన్-వే ప్రయాణంలో రైలు నెం. 12926 పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు జతచేయాల్సి ఉంది. సెలూన్ కారును వాణిజ్యపరంగా నడపడానికి ఆ రోజున నోటిఫికేషన్ జారీ చేసింది. సమయపాలన, భద్రత, ప్రయాణికుల సౌకర్యం, సురక్షితత్వాన్ని నిర్ధారించే ప్రాథమిక పాత్రలు, బాధ్యతలు ఎటువంటి రాజీ లేకుండా రైల్వేలవే. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సంబంధిత టీమ్ బుక్ చేసిన సెలూన్ కారులో పూజారి అభిషేకం చేస్తున్నట్లు కనిపించింది అంటూ రైల్వేశాఖ ఎక్స్‌లో పేర్కొంది. మతపరమైన పూజలు చేయడం నిబంధనలు విరుద్దమని రైల్వేశాఖ ఎక్కడా పేర్కొనలేదు.
Hello @AshwiniVaishnaw, was this approved by @RailMinIndia? If so, What is the procedure? pic.twitter.com/9VUJP53lJQ
— Mohammed Zubair (@zoo_bear) July 12, 2026