
పంజాబ్ పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISIతో సంబంధం ఉన్న రెండు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పంజాబ్ పోలీసులు ఛేదించారు. నలుగురు మైనర్లతో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన జంతర్‌మంతర్‌పై దాడికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలడంతో కలకలం రేగింది.
దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ISI మరోసారి కుట్ర పన్నింది. అయితే, పంజాబ్ పోలీసులు సమయస్పూర్తితో వ్యవహరించి ఆ కుట్రను భగ్నం చేశారు. ఐఎస్‌ఐ (ISI) ఉగ్ర కుట్రకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
జంతర్‌మంతర్‌పై దాడికి ప్లాన్..!
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన ఓ ప్రదర్శన సమయంలో భారీ ఉగ్రదాడికి ఈ ముఠా వ్యూహం పన్నింది. నిందితులు తమ సహచరులతో కలిసి ఢిల్లీకి కూడా వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ హ్యాండ్లర్ సూచన మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తిని కలిసి ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందజేయాల్సి ఉంది. అయితే, జంతర్‌మంతర్ వద్ద ఉన్న పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా కారణంగా వారి కుట్ర ఫలించకపోవడంతో తిరిగి వచ్చేశారు.
రెండు మాడ్యూల్స్.. పట్టుబడింది ఇలా:
1. మొదటి మాడ్యూల్ (రాజాసాన్సి): సుఖ్‌మన్ సింగ్, మరో ముగ్గురు మైనర్లతో కూడిన ఈ బృందం వద్ద 4 పెట్రోల్ బాంబులు, 2 పిస్టల్స్, 9 తూటాలు, లైటర్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని పోలీసు భవనాలు, పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించడమే కాకుండా, ఢిల్లీ దాడికి వీరు ప్లాన్ చేశారు.
2. రెండో మాడ్యూల్ (రైల్వే ట్రాక్ నిఘా): రైల్వే ట్రాక్‌ల వద్ద రహస్య సీసీటీవీ కెమెరాలు అమర్చి, రైళ్ల కదలికలను రికార్డ్ చేసి పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు చేరవేస్తున్న వంశ్ కుమార్, ఒక మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పిస్టల్, తూటాలు, సీసీటీవీ కెమెరాలు, దొంగిలించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు సప్లై చేసిన అన్మోల్ సింగ్‌తో పాటు, ఆయుధ చట్టం కింద ఇప్పటికే జైలులో ఉన్న సుఖ్‌దేవ్ సింగ్, హర్మన్ సింగ్‌లను ప్రొడక్షన్ వారెంట్‌పై విచారిస్తున్నారు.
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని..
అరెస్ట్ అయిన నిందితుల్లో వంశ్ కుమార్ (19), హర్మన్ సింగ్ (24), సుఖ్‌దేవ్ సింగ్ (30), అన్మోల్ సింగ్ (20), సుఖ్‌మన్ సింగ్ (19)లతో పాటు నలుగురు మైనర్లు ఉన్నారు. వీరంతా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే కావడం, మధ్యలోనే చదువు మానేయడం గమనార్హం. డబ్బు ఆశ చూపి ఉగ్రమూకలు వీరిని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకున్నట్లు తేలింది. గాజు సీసాలతో పెట్రోల్ బాంబులు తయారు చేయడంలోనూ వీరికి శిక్షణనిచ్చారు.
ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌కు ఆర్థిక సాయం చేస్తున్నదెవరు? ఉత్తరప్రదేశ్‌లో వీరికి సహకరించిన ఆ వ్యక్తి ఎవరు? అనే కోణంలో భద్రతా బలగాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..