పంజాబ్, సెప్టెంబర్ 26: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయారు. దీంతో హుటాహుటీన సీఎం భగవంత్ మాన్‌ను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు సార్లు ఆయన స్పృహ కోల్పోయిన నీరసించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసలు ఆయన ఎటువంటి అనారోగ్యంతో బాదపడుతున్నారో అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భగవంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయనకు ప్రస్తుతం రొటీన్ చెక్-అప్‌లు జరుగుతున్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మన్‌ను డిశ్చార్జి చేస్తామని అధికార ప్రతినిధి తెలిపారు. అసలు ఆయన అనారోగ్యానికి సంబంధించిన ఖచ్చితమైన కారణం వెల్లడించనప్పటికీ, ముఖ్యమంత్రి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫోర్టస్ ఆసుపత్రికి చెందిన వైద్యులు మాత్రం సీఎం ఆరోగ్యం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కొన్ని రోజుల క్రితం లో బీపీ ఉన్నట్లు సీఎం మాన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీ నుంచి మొహాలీకి తరలించారు. ప్రస్తుతం మాత్రం ఆయన ఏ కారణం చేత అస్వస్థతకు గురయ్యారనే విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
కాగా సీఎం భగవత్ మన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ మజిథియా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. “అర్ధరాత్రి, సీఎం సాబ్ ఎమర్జెన్సీగా ఫోర్టిస్ ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. భగవంత్ మన్ జీ త్వరగా కోలుకోండి.. మీకు అంతా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.