
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుమారుడి వీరత్వానికి దేశం అత్యున్నత గౌరవాల్లో ఒకటైన ‘కీర్తి చక్ర’ పురస్కారం దక్కింది. కానీ ఆ గౌరవాన్ని అందుకునేందుకు వేదికపైకి వచ్చిన తల్లికి మాత్రం ఆ క్షణం తన కుమారుడి జ్ఞాపకాలనే మిగిల్చింది. ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఆ దృశ్యం అక్కడున్న వారందరినీ కదిలించింది. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ-2026లో ఈ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన తరఫున పురస్కారం అందుకోవడానికి తల్లి వేదికపైకి వచ్చారు. కుమారుడి పేరు వినగానే ఆమె భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.
ఆ దృశ్యాన్ని గమనించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రొటోకాల్ పక్కనబెట్టి వెంటనే ముందుకు వచ్చి ఆమె చేతులను పట్టుకుని ఓదార్చారు. ఆమెను హత్తుకుని ధైర్యం చెప్పారు. కుమారుడిని కోల్పోయిన ఓ తల్లి బాధను, తన పిల్లలను కోల్పోయిన అనుభవం ఉన్న మరో తల్లి హృదయంతో అర్థం చేసుకున్నట్లుగా ఆమె చూపిన ఆ మానవీయ స్పందన సభలోని ప్రతి ఒక్కరినీ కదిలించింది. సైనికాధికారులు, కేంద్ర మంత్రులు, ఇతర అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు సైతం భావోద్వేగానికి గురయ్యారు.
Emotions ran high as mother of Sepoy Janjal Pravin Prabhakar was in extreme tears and President Murmu, who too has lost her children was seen consoling her
Pravin neutralised 2 terrorists before laying down his life protecting other soldiers in Kashmir in 2024. pic.twitter.com/P82NQ7twmr
— Karthik Reddy (@bykarthikreddy) June 8, 2026
కీర్తి చక్ర ప్రశంసాపత్రం ప్రకారం, అసాధారణ ధైర్యసాహసాలు, విధి పట్ల అచంచలమైన నిబద్ధత కనబరిచిన సిపాయి ప్రవీణ్ ప్రభాకర్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టారు. చివరి శ్వాస వరకు పోరాడి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. మహార్ రెజిమెంట్‌కు చెందిన ప్రవీణ్ ప్రభాకర్, రాష్ట్రీయ రైఫిల్స్ తొలి బెటాలియన్‌లో సేవలందిస్తున్నారు. 2024 జూలై 6న జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ఆయన వీరమరణం పొందారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే నిఘా సమాచారం, కొంతమంది పౌరులను బందీలుగా ఉంచారనే సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. కాల్పుల మధ్య ముందుకు దూసుకెళ్లిన ప్రవీణ్ ప్రభాకర్ ఒక ఉగ్రవాదిని అత్యంత సమీప దూరం నుంచి హతమార్చారు. అనంతరం తీవ్రంగా గాయపడినప్పటికీ, ఓ పౌరుడిని తన శరీరంతో కాపాడుతూ పోరాటాన్ని కొనసాగించారు. ఆయన చూపిన ధైర్యంతో మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు. బందీగా ఉన్న పౌరుడిని సురక్షితంగా రక్షించగలిగారు.
‘‘అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి, దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు. ఆయన వీరత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అధికారిక ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుమారుడి వీరత్వానికి దేశం వందనం చేస్తుండగా.. అతడిని కోల్పోయిన తల్లి కన్నీరు మాత్రం అక్కడున్న ప్రతి హృదయాన్ని తడిపింది. రాష్ట్రపతి ముర్ము ఆమె చేతిని పట్టుకుని ఓదార్చిన ఆ క్షణం.. ఆ కార్యక్రమంలోనే అత్యంత భావోద్వేగ ఘట్టంగా నిలిచిపోయింది.