కోర్టు ధిక్కరణ కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ తాను సుప్రీంకోర్టుకు చెల్లించాల్సిన రూపాయి జరిమానా చెల్లించారు. కోర్టు రిజిస్ట్రీకి ఈ సొమ్మును చెల్లించానని, అంతమాత్రాన కోర్టు తీర్పును అంగీకరించినట్టు కాదని ఆయన చెప్పారు. రాజస్తాన్ కు చెందిన కొంతమంది బృందంతో బాటు ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీంకోర్టు ఆవరణలోకి చేరుకున్నారు. ఈ రూపాయి నాణేలను అనేకమంది సేకరించారని, వీళ్ళు ‘రూపాయి ప్రచారాన్ని’ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.ప్రజలు ఇచ్ఛే ప్రతి రూపాయితో ‘ట్రూత్ ఫండ్’ (సత్య నిధి) అనే ఫండ్ ని ఏర్పాటు చేశామని, నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించేవారు వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో.. అలాంటి బాధితులకు సహాయపడేందుకు ఈ రూపాయి నాణేలను వినియోగిస్తామని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ అల్లర్ల తో ప్రమేయముందని కారణం చూపి పోలీసులు అరెస్టు చేసిన జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ మాజీ విద్యార్ధి ఉమర్ ఖాలిద్ అరెస్టును ప్రస్తావించారు. అలాగే సీపీఎం సీనియర్ ర్ నేత సీతారాం ఏచూరిని, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ ను, మరికొంతమందిని ఖాకీలు నిందితులుగా పేర్కొనడాన్ని గుర్తు చేస్తూ.. విమర్శకులను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాంటి బాధితులకు తోడ్పడేందుకే ఈ ‘రూపాయి ప్రచారాన్ని’ ప్రారంభించినట్టు తెలిపారు.