మీది ప్రధానిని అనే స్థాయా..?.. కర్నాటక కాంగ్రెస్ సర్కార్‌పై ప్రహ్లాద్ జోషి ఫైర్

ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సూచనలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో దేశం “ఫ్రాజైల్ ఫైవ్” స్థితికి చేరిందని.. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. కర్ణాటకలో పెరుగుతున్న అప్పులు, ధరల భారంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జోషి తీవ్రంగా విమర్శించారు.

మీది ప్రధానిని అనే స్థాయా..?.. కర్నాటక కాంగ్రెస్ సర్కార్‌పై ప్రహ్లాద్ జోషి ఫైర్
Pralhad Joshi -Siddaramaiah

Updated on: May 12, 2026 | 1:02 PM

కర్ణాటక రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను దాచిపెట్టేందుకే సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎక్స్ వేదికగా వేదికగా స్పందించిన ప్రహ్లాద్ జోషి.. “భారత్‌ను ఒకప్పుడు ‘ఫ్రాజైల్ ఫైవ్’ దేశాల జాబితాలోకి నెట్టింది కాంగ్రెస్ పాలనే. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది” అంటూ విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రజలను పొదుపు చేయమని, ఇంధన వినియోగం తగ్గించమని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించమని ప్రధాని చేసిన సూచనలను కాంగ్రెస్ తప్పుగా అర్థం చేసుకుంటోందని జోషి విమర్శించారు. “ప్రపంచ ఆర్థిక అనిశ్చితి సమయంలో దేశాన్ని బలోపేతం చేసే చర్యలు తీసుకోవడం నాయకత్వ లక్షణం. కానీ కాంగ్రెస్‌కు మాత్రం ఉచిత హామీలు, రాజకీయ లాభాలే ముఖ్యమయ్యాయి” అని ఎద్దేవా చేశారు.

అంతేకాదు.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రహ్లాద్ జోషి. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, రెవెన్యూ లోటు చరిత్రాత్మక స్థాయికి చేరిందని ఆరోపించారు. బెంగళూరు రోడ్లు దారుణంగా మారాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక నిరసనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంకంటే కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేల లెక్కలతోనే బిజీగా ఉన్నారని విమర్శించారు. గ్యారెంటీలు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలపై ధరల భారం మోపిందని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. పాలు, విద్యుత్, ఇంధనం, రవాణా ఛార్జీలు సహా దాదాపు 48 రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగాయని అన్నారు. ప్రజలకు ఉపశమనం ఇస్తామని చెప్పి.. మరింత భారాన్ని మోపిందని విమర్శించారు. “ప్రధానిని ప్రశ్నించే ముందు మీ ప్రభుత్వం ఎందుకు అంతర్గత కలహాలు, పరిపాలనా లోపాలు, పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతోందో ప్రజలకు సమాధానం చెప్పండి” అంటూ సిద్ధరామయ్యకు ప్రహ్లాద్ జోషి సవాల్ విసిరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us