Kangana Ranaut: పాపం కంగనా.. ఎంపీగా ఏదో అనుకుంది.. ఏదేదో అవుతుంది..

ఎంపీ అయినప్పటి నుంచి ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ కంగనా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా ఈ కుండబద్ధలు కొడుతుంది. వరద బాధితుల వద్దకు వెళ్లినప్పుడు తన దగ్గర ఎటువంటి నిధులు లేవని చెప్పి అంతా షాకయ్యేలా చేసింది. ఇప్పుడు మరోసారి రాజకీయాలు, జీతం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Kangana Ranaut: పాపం కంగనా.. ఎంపీగా ఏదో అనుకుంది.. ఏదేదో అవుతుంది..
Kangana Ranaut

Updated on: Jul 12, 2025 | 6:10 PM

కంగనా రనౌత్.. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యింది. ఎంపీ అయ్యినప్పటి నుంచి ఆమె పలు వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఎమర్జెన్సీ మూవీ తీసి కాంట్రవర్సీకి తెరదీశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీపై వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అంతకుముందు రైతులకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. పార్టీ ఖండించాల్సి వచ్చింది. ఇక ఇటీవలే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కంగనా.. బాధితులకు సాయం చేసేందుకు తాను ప్రధాని లేదా కేంద్రమంత్రిని కాదని వ్యాఖ్యానించింది. తన వద్ద ఎటువంటి నిధులు లేవని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజాయితీగా ఉండే ఎంపీలకు జీతం సరిపోదని చెప్పి సరికొత్త చర్చకు తెరలేపింది.

ఎంపీలకు చాలా ఖర్చులు ఉంటాయని.. కేంద్రం ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదని కంగనా అన్నారు. నియోజకవర్గాల్లో తిరగాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. సిబ్బందితో కలిసి రెండు, మూడు కార్లలో వెళ్లాలని.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి 300-400 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖర్చులు కలిసి తడిసి మోపెడవుతాయని చెప్పారు. రాజకీయాలు అన్నుకున్నంత ఈజీ కాదని.. చాలా కాస్ట్లీ అని  వ్యాఖ్యానించారు. అందుకే ఎంపీలు మరో ఉద్యోగం చేయాలన్నారు. మరో ఉద్యోగం లేదా వ్యాపారం లేకపోతే ఇక్కడ నెగ్గుకరావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని.. అంతేకాకుండా పలువురు న్యాయవాదులుగా పనిచేస్తున్నారని చెప్పారు. అలా చేయకపోతే డబ్బుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.

అంతకుముందు రాజకీయాలను ఆస్వాదిస్తున్నారా అన్న ప్రశ్నకు కంగనా లేదని వ్యాఖ్యానించింది. రాజకీయాలు అంటే సామాజిక సేవ లాంటిదని చెప్పారు. గతంలో తనకు సేవ చేసిన అనుభవం లేదని తెలిపింది. అంతేకాకుండా కొంతమంది చిన్న చిన్న విషయాలకే తన వద్దకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. డ్రైనేజీ పంచాయతీ సైతం తన వద్దకు తీసుకొస్తున్నారని.. కానీ తన వద్ద నిధులు లేవని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా.. మళ్లీ ఇప్పుడు జీతంపై మాట్లాడి సరికొత్త చర్చుకు తెరదీశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..