పోలవరం ప్రాజెక్ట్‌.. సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర కేబినెట్‌దే తుది నిర్ణయం: కేంద్ర జలశక్తి మంత్రి

|

Feb 08, 2021 | 12:30 PM

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర మంత్రి మండలిదే తుది నిర్ణయమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌

పోలవరం ప్రాజెక్ట్‌.. సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర కేబినెట్‌దే తుది నిర్ణయం: కేంద్ర జలశక్తి మంత్రి
Follow us on

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర మంత్రి మండలిదే తుది నిర్ణయమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చిందని మంత్రి వివరించారు. దానికి అనుగుణంగా 2013-14 ధరల స్థాయిని ప్రాతిపదికగా తీసుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని భరించడానికి వీలుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిన కేబినెట్‌ నోట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అందువలన ధరల పెరుగుదలకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని పెంచే అధికారం లేదు.

అయితే 2017 నాటి ధరల ప్రాతిపదికన రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) రూపొందించిన అంచనా వ్యయంపై ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. చర్చలు పూర్తయిన పిమ్మట ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్‌కు సమర్పించడం జరుగుతుంది. సవరించిన అంచనా వ్యయంపై కేబినెట్‌ తీసుకునే తుది నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని జలశక్తి మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యాన్ని నివారించి, పనులను వేగవంతం చేయడానికి వీలుగా నిధుల విడుదలకు వీలు కల్పించే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినప్పటి నుంచి మొదలకుని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ(పీపీఏ)కి కేంద్రం నిధుల విడుదల చేసే వరకు అనుసరిస్తున్న సుదీర్ఘ ప్రక్రియ కారణంగా ప్రాజెక్ట్‌ పనులలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. కాబట్టి నిధుల సత్వర విడుదల కోసం ముఖ్యమంత్రి ప్రతిపాదించిన రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు ప్రణాళికపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందా అన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబు ఇలా ఉంది.

పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా దీనిని రీయింబర్స్‌ విధానంలో చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. లాంగ్‌ టర్మ్‌ ఇరిగేషన్‌ ఫండ్‌ (ఎల్‌టీఐఎఫ్‌), నాబార్డు ద్వారా నిధులను సేకరించడం జరుగుతుంది. తమ మంత్రిత్వ శాఖ నుంచి ఇంత మొత్తం నిధులు కావాలని కోరిన పిదప నాబార్డ్‌ మార్కెట్‌ నుంచి నిధులను సేకరిస్తుంది. ఈ ప్రక్రియకు రెండు మూడు వారాలపాటు పడుతుంది. సేకరించిన నిధులను నాబార్డు నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూఏ)కి బదలాయిస్తుంది. తదుపరి పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఈ నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి బదలాయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు రోజుల్లో ముగుస్తుందు. ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం చేసే ఖర్చుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే బిల్లులను పరిశీలించి ఆమోదించిన పిమ్మట తదుపరి విడత నిధుల విడుదల జరుగుతుంది. కాబట్టి నిధుల ప్రవాహంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్న వేగంగా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు పూర్తవుతాయని జలశక్తి మంత్రి చెప్పారు.

Also Read: PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించకుండా ఉండాల్సింది: ప్రధాని మోదీ