ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడారు. ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 16)ఖతార్ ప్రస్తుత ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, దివంగత నాయకుడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
Pm Modi Mourns Emir Sheikh Hamad

Updated on: Jul 16, 2026 | 10:17 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడారు. ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 16)ఖతార్ ప్రస్తుత ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, దివంగత నాయకుడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, షేక్ హమద్‌కు భారతదేశంపై ప్రత్యేక అభిమానం ఉండేదని పేర్కొన్నారు. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల పట్ల ఆయన చూపిన ఆదరణ, భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని మోదీ కొనియాడారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన వారసత్వం ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రధాని మోదీ మాజీ ఎమిర్‌ను దూరదృష్టి కలిగిన నాయకుడుగా అభివర్ణిస్తూ నివాళులర్పించారు. ఖతార్‌ను అభివృద్ధి, శ్రేయస్సు దిశగా నడిపించిన నాయకుడిగా, భారత్‌కు నిజమైన స్నేహితుడిగా ఆయనను గుర్తుచేసుకున్నారు. 2024లో ఖతార్ పర్యటన సందర్భంగా షేక్ హమద్‌తో జరిగిన సమావేశాన్ని కూడా మోదీ స్మరించుకున్నారు.

మాజీ ఎమిర్ మరణానికి గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేసి నివాళులర్పించింది. ఈ నిర్ణయం భారత్–ఖతార్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా భావిస్తున్నారు.

1995 నుంచి 2013 వరకు ఖతార్‌కు నాయకత్వం వహించిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, ఆధునిక ఖతార్ రూపశిల్పిగా గుర్తింపు పొందారు. ఆయన పాలనలో ఖతార్ ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడమే కాకుండా, అంతర్జాతీయ దౌత్యరంగంలోనూ కీలక స్థానం సంపాదించింది.

ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దోహాను సందర్శించి, భారత ప్రభుత్వం తరఫున మాజీ ఎమిర్‌కు నివాళులర్పించారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని కలిసి ప్రధాని నరేంద్ర మోదీ సంతాప సందేశాన్ని అందజేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us