PM SVANidhi : వీధి వ్యాపారులకు అండగా ‘పీఎం స్వనిధి’.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

భారతదేశంలోని అనధికారిక పట్టణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వీధి వ్యాపారులకు 'పీఎం స్వనిధి' ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం ఒక పెద్ద వరంగా మారింది. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు అందించడమే కాకుండా, ఈ పథకం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ, సామాజిక భద్రతను పెంచుతూ వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

PM SVANidhi : వీధి వ్యాపారులకు అండగా పీఎం స్వనిధి’.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
Pm Svanidhi Scheme

Updated on: Jun 01, 2026 | 2:36 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం స్వనిధి పథకం దేశంలోని చిరు వ్యాపారులకు ఒక వరంగా మారింది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులు ఎలాంటి రుణం లేకుండా రుణాలు పొందుతూ తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. 2020లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.12 కోట్లకు పైగా ప్రభుత్వం రుణాలు అందించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని 75 లక్షల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. ఇప్పటివరకు 17,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రుణాలను ఈ పథకం కింద అందజేశారు. ఈ పథకానికి వస్తున్న ఆధరణ చూసి ఈ పథకాన్ని మరో నాలుగేళ్ల పాటు అంటే 2030 వరకు పొడగించారు.

డిజిటల్ విప్లవం – రికార్డు స్థాయి లావాదేవీలు

పీఎం స్వనిధి పథకం చిరు వ్యాపారులను డిజిటల్ ప్రపంచంతో విజయవంతంగా అనుసంధానించింది. దేశ వ్యాప్తంగా సుమారు 55 లక్షల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చేర్చారు. వీరంతా కలిసి దాదాపు 8.96 లక్షల కోట్ల రూపాయల విలువైన 841 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలను నిర్వహించారు. డిజిటల్ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు, వడ్డీ సబ్సిడీల ద్వారా లబ్ధిదారులకు దాదాపు 800 కోట్ల రూపాయలు లభించాయి.

పథకం ముఖ్య విశేషాలు

  • వర్కింగ్ క్యాపిటల్ లోన్: మూడు దశల్లో ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 15,000, 25,000, 50,000 వరకు రుణాలు అందిస్తారు.
  • యూపీఐ-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్: రెండవ దశ రుణాన్ని విజయవంతంగా చెల్లించిన వ్యాపారులు రూ. 30,000 పరిమితి గల రూపే క్రెడిట్ కార్డ్‌కు అందజేస్తారు.
  • స్వనిధి సే సమృద్ధి : లబ్ధిదారులు, వారి కుటుంబాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం 8 ఎంపిక చేసిన కేంద్ర సంక్షేమ పథకాలతో వీరిని అనుసంధానిస్తారు.
  • నైపుణ్యాభివృద్ధి: వ్యాపారులకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతతో పాటు ఆహార భద్రత, పరిశుభ్రతపై శిక్షణ ఇస్తారు.

సామాజిక సమతుల్యత, ఆర్థిక వృద్ధి

2023, 2025 లలో నిర్వహించిన స్వతంత్ర ప్రభావ అంచనా అధ్యయనాల ప్రకారం, ఈ పథకం ద్వారా లబ్ధిదారుల వార్షిక ఆదాయంలో సగటున 20 శాతం పెరిగింది. అంతేకాకుండా, ఈ పథకాన్ని వినియోగించుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లబ్ధిదారులలో దాదాపు 46 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. అలాగే, సుమారు 70 శాతం మంది లబ్ధిదారులు సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారే కావడంతో ఈ పథకం అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తోందని స్పష్టమవుతోంది.

మొత్తంగా ఒకప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు వీధి వ్యాపారులుగా, ఆర్థిక సాయం అందక ఇబ్బందులు పడగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి పీఎం స్వనిధి ద్వారా స్వయం ఉపాధి, స్వావలంబన, స్వాభిమానంతో భారతదేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వాములుగా మారుతున్నారు. ఇంది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే ఈ ‘పీఎం స్వనిధి’ పథకం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారుల జీవితాల్లో ఈ పథకం తీసుకువచ్చిన మార్పులను ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఎలాంటి గ్యారెంటీ లేని రుణాలు అందిచడంతో ఈ పథకం చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఎంతగానో తోల్పడిందని పేర్కొన్నారు. పీఎం స్వనిధి అనేది నమ్మకం, గౌరవం, సాధికారతతో కూడిన పథకమని ఆయన చెప్పుకొచ్చారు.

మోదీ పోస్ట్ ఇక్కడ చూడండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us