PM Modi: మోదీ పేరు ప్రతిపాదించిన ఆ నలుగురు ఎవరో తెలుసా?

హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం.. ముక్తిధామం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారిగా 2014లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన మోదీ, ఆ తర్వాత ప్రధానిగా 2019లో నామినేషన్ దాఖలు చేశారు.

PM Modi: మోదీ పేరు ప్రతిపాదించిన ఆ నలుగురు ఎవరో తెలుసా?
Pm Modi
Follow us

| Edited By: Srikar T

Updated on: May 14, 2024 | 2:12 PM

హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం.. ముక్తిధామం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారిగా 2014లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన మోదీ, ఆ తర్వాత ప్రధానిగా 2019లో నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి నామినేషన్ కార్యక్రమాన్ని ఓ భారీ వేడుకలా మార్చారు. దాదాపు 12 మంది ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనాయకత్వంతో పాటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఎన్నికలకు ముందే తమ సత్తా చాటే ప్రయత్నం చేశారు. హిందువుల పవిత్ర నది గంగ ఆవిర్భవించిన రోజుగా చెప్పుకునే ‘గంగా సప్తమి’ సందర్భంగా ఆయన తొలుత దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్రూజ్‌లో నమో ఘాట్ వరకు వెళ్లిన మోదీ, కాలభైరవ ఆలయంలోనూ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అట్టహాసంగా జరిగిన నామినేషన్ కార్యక్రమంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయం.. ఈసారి ఆయన్ను వారణాసి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన ఆ నలుగురు ఎవరు? వారితోనే ప్రతిపాదన చేయించడం వెనుక వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగులోకివచ్చాయి.

తనను వారణాసి అభ్యర్థిగా ప్రతిపాదించేవారిని ఎంపిక చేసే విషయంలోనూ నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వివిధ వర్గాలు, ప్రాంతాల మధ్య సమతౌల్యం పాటిస్తూ.. పార్టీ కోసం నిస్వార్థంగా అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ ఈ కూర్పు జరిగింది. మోదీ నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదకులుగా సంతకాలు చేసినవారిలో బైజ్‌నాథ్ పటేల్, గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, లాల్‌చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్ ముఖ్యులు. వీరు వేర్వేరు సామాజిక వర్గాలకు, వేర్వేరు ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

బైజ్‌నాథ్ పటేల్..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రోహనియా-సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్త బైజ్‌నాథ్ పటేల్. ఆయన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం కంటే ముందు ఉన్న జనసంఘ్ కాలం నుంచి పార్టీ కార్యకర్తగా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారి ప్రభావం పెరిగిందని, తనలాంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ మధ్య బైజ్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పటేల్ అసంతృప్తిని గమనించిన మోదీ వ్యూహాత్మకంగా ఆయన్ను ప్రతిపాదకుల జాబితాలో చేర్చి మొదటి స్థానం ఇచ్చారు. తద్వారా మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చినట్టయింది. బైజ్‌నాథ్ పటేల్ నివాసముండే రోహనియా-సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గం.. మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. పైగా పటేల్ ఓటర్లు 2 లక్షలకు పైగా ఉన్నారు. మోదీ తాజా చర్య వీరందరినీ ఆకట్టుకోవడంలో మాస్టర్ స్ట్రోక్‌లా పనిచేస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గణేశ్వర్ శాస్త్రి..

గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ రెండో ప్రతిపాదకుడు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్, అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనకు, వ్యాస్‌జీ నేలమాళిగలో పూజ చేయడానికి అనుకూలమైన సమయాన్ని నిర్ణయించిన పండితుడు. ఆయన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వారణాసి – దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బ్రాహ్మణులు 3 లక్షలకు పైగా ఉన్నారు. వారిలో కొన్ని శతాబ్దాల క్రితమే ఇక్కడికి వచ్చి స్థిరపడిన దక్షిణాది బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఉన్నాయి. గణేశ్వర్ శాస్త్రిని ప్రతిపాదకుడిగా చేర్చడం ద్వారా ఈ వర్గానికి ప్రాధాన్యత తగ్గలేదని చాటిచెప్పినట్టయింది. బీజేపీ అంటే బ్రాహ్మిణ్, బనియా (వైశ్య) పార్టీగా ముద్ర ఉంది. మోదీ-షా ద్వయం అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తిరుగులేని శక్తులుగా ఎదిగిన తర్వాత పార్టీలో బ్రాహ్మణ, బనియా వర్గాల ఆధిపత్యానికి అడ్డుకట్టపడింది. ఈ అసంతృప్తి ఈ రెండు వర్గాల్లోనూ ఉంది. అయితే రాజ్‌పుత్‌ల రాజ్యంగా చెప్పుకునే రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని బ్రాహ్మణ వర్గం నేత భజన్‌లాల్ శర్మకు అప్పగించడం ద్వారా మోదీ వారిని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతకంటే ముందు “ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు” (EWS) పేరుతో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం కూడా ఈ వర్గాల్లో అసంతృప్తిని చాలావరకు తగ్గించింది. ఇప్పుడు మోదీ తన సొంత నియోజకవర్గంలో తన పేరును ప్రతిపాదించేవారి జాబితాలో ఓ బ్రాహ్మణ పండితుడికి అవకాశం కల్పించడం కూడా ఆ వర్గాల్లో విస్తృత చర్చకు అవకాశమిచ్చింది.

లాల్‌చంద్ కుష్వాహా..

లాల్‌చంద్ కుష్వాహా ఇతర వెనుకబడిన వర్గాలు (OBC)కు చెందిన కార్యకర్త. వారణాసి కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన వచ్చారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా ఓబీసీ వర్గాలు సమాజ్‌వాదీ (SP) వెంట నిలవగా.. ఆ పార్టీలో యాదవులకు తప్ప యాదవేతర ఓబీసీలకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అంశాన్ని బీజేపీ ఆయుధంగా మలచుకుంది. 2014 నుంచి క్రమక్రమంగా యాదవేతర ఓబీసీ వర్గాల్లో పట్టు పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ క్రమంలో కుష్వాహాలు ఒక కీలక సమూహం. స్వయానా మోదీ కూడా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో బీజేపీకి, మోదీకి ఈ వర్గాల్లో ఆదరణ పెరుగుతోంది. మోదీ ప్రధాని అయ్యాకనే “నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ (NCBC)”కి రాజ్యాంగబద్ధత కల్పించారు. అలాగే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ-2 ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఏకంగా 27 మంది ఓబీసీలకు చోటు కల్పించి చరిత్రలోనే అత్యధిక మంత్రిపదవులు ఇచ్చిన రికార్డు కూడా సృష్టించారు. వీటన్నింటికీ తోడు ఇలాంటి సందర్భాల్లోనూ ఓబీసీ నేతలకు పక్కన నిలబెట్టుకోవడం ద్వారా వారికి ఓ సందేశాన్ని పంపుతున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో యాదవేత ఓబీసీలు 2.5 లక్షల మంది వరకు ఉన్నారు.

సంజయ్ సోంకర్..

దళిత వర్గానికి సైతం తమ ప్రాధాన్యత ఉంటుందని చాటిచెప్పేలా ఆ వర్గం నుంచి సంజయ్ సోంకర్‌ను ప్రతిపాదకుడిగా మోదీ ఎంపిక చేసుకున్నారు. యూపీలో దళితులు చాలా వరకు బహుజన్ సమాజ్ పార్టీ (BSP)కి వెన్నెముకలా ఉన్నారు. కాన్షీరాం పార్టీని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. దానికి బ్రేకులు వేసి తమవైపు తిప్పుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో కొంతవరకు సఫలమైనట్టే కనిపిస్తోంది. ఇప్పుడు నామినేషన్ సందర్భంగా సంజయ్ సోంకర్‌ను పక్కన నిలబెట్టుకోవడం ఆ వర్గానికి ఓ కీలక సందేశాన్ని పంపినట్టయింది. వారణాసి నియోజకవర్గంలో 1.25 లక్షల మంది దళిత ఓటర్లున్నారు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, గణాంకాలను బేరీజు వేసుకున్న తర్వాతనే మోదీ వ్యూహాత్మకంగా ఈ నలుగురిని తన ప్రతిపాదకుల జాబితాలో చేర్చినట్టు అర్థమవుతోంది.

ప్రధాని రోడ్ షో!..

ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా సోమవారం నుంచే హడావుడి మొదలైంది. నామినేషన్‌కు ముందు రోజు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకున్నారు. కాశీలో ప్రధాని మోదీ కాన్వాయ్‌ వెళ్లిన ప్రదేశంపై పూలవర్షం కురిసింది. కాశీలో దాదాపు 6 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. లంక నుంచి కాశీ విశ్వనాథ ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసేందుకు ప్రధాని మోదీకి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. ఈ సమయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ప్రజలు ఎక్కడికక్కడ నిలబడి ఉత్సాహంగా పాల్గొన్నారు. మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.

2014లో తొలిసారి పోటీ చేసిన మోదీ గత రికార్డులను బద్దలు కొడుతూ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 1991 నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్న బీజేపీకి 2004లో బ్రేక్ పడింది. ఆ తర్వాత 2009లో పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కేవలం 30.52 శాతం ఓట్లతోనే ప్రత్యర్థులపై విజయం సాధించారు. మిగతా ఓట్లన్నీ వివిధ పార్టీల మధ్య చీలడం ఆయనకు కలిసొచ్చింది. 2014లో మోదీ అడుగుపెట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో మోదీ ఏకంగా 56.37 శాతం ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో ఆ మెజారిటీ మరింత పెరిగింది. రికార్డు స్థాయిలో 63.62 శాతం ఓట్లతో 4.79 లక్షల మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేయగా.. ఈసారి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ విడిగా పోటీ చేస్తోంది. ఇలా మారిన రాజకీయ సమీకరణాల లెక్కలు ఎలా ఉన్నా.. ఇక్కడ మోదీ విజయాన్ని అడ్డుకోవడం ప్రత్యర్థులకు అసాధ్యం. అయితే గతం కంటే మెజారిటీ పెరుగుతుందా.. లేక తగ్గించగల్గుతారా అన్నదే ఇక్కడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles