PM Narendra Modi in Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం – 2020 అమలుపై 300 మంది విద్యావేత్తలతో జరగనున్న మూడు రోజుల సెమినార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతోపాటు రూ. 1,800 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి మోడీ.. తన పర్యటన సందర్భంగా వారణాసిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంపై లాంటి పథకాలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా సిగ్రాలోని డాక్టర్ సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పలు అభివృద్ధి రూ.1800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు వారణాసిలోని ఎల్‌టి కళాశాలలో సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండే సామర్థ్యం ఉన్న ‘అక్షయ పాత్ర మిడ్ డే మీల్ కిచెన్’ను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా జాతీయ విద్యా విధానం అమలుపై ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’ను ప్రారంభించి మాట్లాడారు.
ఇదిలాఉంటే.. ప్రధాని మోడీ వారణాసి పర్యటన సందర్భంగా ఎల్టీ కళాశాలలో వివిధ పాఠశాలలకు చెందిన 20 మంది పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వారి ప్రదర్శనలను ప్రధాని మోడీ దగ్గరుండి వీక్షించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, తరగతులు, సౌకర్యాలపై ప్రధాని మోడీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు సంస్కృతంలో మాట్లాడి ప్రధాని మోదీ మనసు దోచుకున్నారు. PM మోడీ మీద రాసిన పద్యాన్ని విద్యార్థులు సంస్కృతంలో చదివి ఆకట్టుకున్నారు. దీంతోపాటు శ్లోకాలు, సంగీత వాయిద్యాలతో శివ తాండవం కూడా చేశారు. చిన్నారులు ప్రదర్శించిన మొత్తం 21 ప్రదర్శనలను చూసి ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా వారి ప్రతిభను మెచ్చుకుంటూ అభినందించారు.
300 మంది ప్రతినిధులతో.. సదస్సు..
జాతీయ విద్యా విధానం (NEP) 2020ని అమలు చేయడంలో వ్యూహాలు, ఉత్తమ అభ్యాసాలపై చర్చించడానికి ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలకు (HEIs) చెందిన ప్రముఖులతో దీనిని ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్, బనారస్ హిందూ యూనివర్శిటీతో కలిసి విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ సెమినార్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన 300 మంది వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, పలువురు ప్రతినిధులు పాల్గొంటున్నారు. NEP 2020ని గత రెండేళ్లలో విజయవంతంగా అమలు చేసిన తీరుపై చర్చించిన అనంతరం దేశవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..