NEET Re-Exam 2026: ట్రాఫిక్‌లో విద్యార్థులు చిక్కుకోకూడదని.. మోదీ తీసుకున్న నిర్ణయం ఇదే!

PM Modi and NEET Re-Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరీక్ష నిర్వహణ కోసం ఎన్‌టీఏ చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా విశేషంగా నిలిచాయి.

NEET Re-Exam 2026: ట్రాఫిక్‌లో విద్యార్థులు చిక్కుకోకూడదని.. మోదీ తీసుకున్న నిర్ణయం ఇదే!
Pm Modi And Neet Re Exam 2026

Updated on: Jun 21, 2026 | 7:01 PM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీ-ఎగ్జామ్ సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న అభ్యర్థులకు ట్రాఫిక్ అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో తన కాన్వాయ్ ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకున్నారని సమాచారం.

ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ.. అదే సమయంలో నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రధాని కాన్వాయ్ కదలికల కారణంగా రహదారులపై ట్రాఫిక్ నియంత్రణలు అమల్లోకి వస్తాయని భావించి, పరీక్ష ప్రారంభ సమయం ముగిసే వరకు వేచి ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాతే ఆయన అక్కడి నుంచి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్

ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రీ-ఎగ్జామ్ నిర్వహించింది. దేశంలోని వందలాది పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని కొన్ని నగరాల్లో కూడా పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థులకు అదనపు సమయం కల్పించారు. ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు ఎన్‌టీఏ విస్తృత ఏర్పాట్లు చేసింది.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

పరీక్షా కేంద్రాల వద్ద బహుళస్థాయి భద్రతను అమలు చేశారు. అభ్యర్థులను మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేయడంతో పాటు, కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక జామర్లు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా గదిలో ఇన్విజిలేటర్లను నియమించి, కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. అదనంగా బయోమెట్రిక్ ధృవీకరణ, ముఖ గుర్తింపు వ్యవస్థలను ఉపయోగించి అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు.

ప్రశ్నాపత్రాల రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు

పరీక్షా ప్రశ్నాపత్రాల భద్రత కోసం పోలీసులు, పారామిలిటరీ బలగాలు, పోస్టల్ శాఖతో పాటు ఇతర కేంద్ర సంస్థల సహకారం తీసుకున్నారు. రహస్య పత్రాల నిల్వ, రవాణా, పంపిణీ ప్రక్రియలను ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించారు.

విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం సౌకర్యాలు

ఎండ, వాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సహాయం, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచారు. పరీక్ష హాళ్లలో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, కేంద్రాల బయట వేచి ఉండే తల్లిదండ్రుల కోసం ప్రత్యేక షెల్టర్లు, కూర్చునే ఏర్పాట్లు చేశారు. నీట్ రీ-ఎగ్జామ్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ, భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయడం విశేషంగా నిలిచింది.

మోదీ నిర్ణయంపై ప్రశంసలు

ప్రధాని చర్యపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం మోదీ నాయకత్వ లక్షణమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం బాధ్యతాయుత పాలనకు నిదర్శనమని అన్నారు.

Follow Us