PM Modi: భాయియో.. ఆ నూనెలు మనకొద్దు.. ఆ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు మోదీ పిలుపు

వంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన కొవ్వు రకం. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఊబకాయానికి కారణమవుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో లివర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు ఊబకాయం రిస్క్ కూడా ఉంటోంది. తాజాగా ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. నూనెల వాడకంపై ప్రజలను అప్రమత్తం చేశారు.

PM Modi: భాయియో.. ఆ నూనెలు మనకొద్దు.. ఆ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు మోదీ పిలుపు
Pm Modi

Updated on: Apr 19, 2025 | 5:43 PM

ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అవలంబించి, ఊబకాయంతో పోరాడాలని కోరారు. చిన్న చిన్న మార్పులతోనే ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు. ముఖ్యంగా వంట నూనె వాడకాన్ని తగ్గించడం, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తాయని ఆయన సూచించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకు స్పందిస్తూ, మోదీ ఇలా అన్నారు. “ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఆరోగ్యకర జీవనశైలి, ఆలోచనాత్మక ఆహారం కోసం పిలుపునిచ్చే సందర్భంగా గుర్తించడం ప్రశంసనీయం. నూనె వాడకాన్ని తగ్గించడం వంటి చిన్న చర్యలు పెద్ద మార్పులను తెస్తాయి. ఊబకాయం గురించి అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన భారతాన్ని కలిసి నిర్మిద్దాం.” అని మోదీ అన్నారు.

ఇంతకు ముందు, నడ్డా తన ఎక్స్ పోస్ట్‌లో, “ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా, వంట నూనె వాడకాన్ని కనీసం 10 శాతం తగ్గించి, ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించాలని ప్రతిజ్ఞ చేద్దాం. ఆహారాన్ని ఔషధంగా భావిస్తే చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి,” అని పేర్కొన్నారు. మోదీ పిలుపుకు స్పందిస్తూ, ఊబకాయం దాని ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి కృషి చేయాలని నడ్డా తెలిపారు.

కాలేయం మానవ శరీరంలో ఒక అద్భుతమైన అవయం. సొంతంగా నిర్మితమయ్యే శక్తి దీనికి మాత్రమే ఉందని, సరైన జీవనశైలి మార్పులతో సంవత్సరాల నష్టాన్ని కూడా సరిచేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్‌లతో కూడిన ఆహారం కాలేయ వ్యాధులను నివారించడమే కాక, కాలేయ పునరుత్పత్తికి కూడా సహాయపడుతుంది.

మోదీ ఇటీవల భారతీయులను ఊబకాయం లేని జీవనశైలిని అవలంబించి, వికసిత భారత లక్ష్యానికి దోహదపడాలని కోరారు. నూనె వాడకాన్ని తగ్గించడం వంటి ఆరోగ్యకర ఆహార నిర్ణయాలు వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా అని ఆయన అన్నారు. “ఈ రోజు మీతో ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలనుకుంటున్నాను. మనం అందరం వంట నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించాలి. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో పెద్ద అడుగు అవుతుంది,” అని మోదీ పేర్కొన్నారు.

ఊబకాయం, జీవనశైలి సంబంధిత వ్యాధులపై మోదీ నిరంతరం అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.