PM Kisan: పీఎం కిసాన్ పథకంపై కేంద్రం కీలక ప్రకటన.. రైతులు వెంటనే చెక్ చేసుకోండి..

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి లక్షల మంది లబ్ధిదారుల పేర్లు తొలగింపుపై కేంద్రం ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. నిబంధనలు పాటించని వారి పేర్లు తాత్కాలికంగా తొలగించినట్లు తెలిపింది. అర్హులైన రైతులు భౌతిక ధృవీకరణ తర్వాత తిరిగి జాబితాలో చేర్చుతారు.

PM Kisan: పీఎం కిసాన్ పథకంపై కేంద్రం కీలక ప్రకటన.. రైతులు వెంటనే చెక్ చేసుకోండి..
Pm Kisan Yojana

Updated on: Nov 10, 2025 | 1:21 PM

దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. లక్షలాది మంది రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితా నుండి తొలగింపుపై వస్తున్న పుకార్లపై అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ముఖ్యమైన నోటీసుతో స్పష్టతనిచ్చింది.

పేర్ల తొలగింపుకు ప్రధాన కారణాలు ఇవే

అనేక మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం అనర్హులు అయినప్పటికీ కొందరు లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందుతున్నారు. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ప్రయోజనం పొందవలసి ఉండగా.. చాలా కుటుంబాలలో భర్తలు, భార్యలు లేదా మైనర్ పిల్లలు విడివిడిగా దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసిన రైతులు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు పొందకూడదు. ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోని లేదా నిబంధనలను ఉల్లంఘించిన లక్షలాది మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

అర్హులైన రైతులకు తిరిగి అవకాశం

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పారదర్శకతను పెంచడం, ప్రయోజనాలు నిజమైన రైతులకు మాత్రమే చేరేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. పేర్లు తొలగించబడిన రైతులను ఇప్పుడు భౌతికంగా ధృవీకరించడం జరుగుతుంది. ఈ ధృవీకరణ తర్వాత ఏ రైతులైతే అర్హులని తేలుతుందో.. వారి పేర్లు తిరిగి లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. నిజంగా అనర్హులుగా తేలిన రైతులు మాత్రం ఇకపై ఈ పథకం నుండి ప్రయోజనం పొందలేరు.

రైతులు తమ స్థితిని ఇలా తనిఖీ చేసుకోవాలి

పుకార్లకు తావు ఇవ్వకుండా రైతులు తమ స్థితిని స్వయంగా చెక్ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. రైతులు PM కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించి వీటిని చెక్ చేయాలి.

Eligibility Status: మీరు ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

Know Your Status: ఈ విభాగానికి వెళ్లి మీ పేరు ఇప్పటికీ లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదా తొలగించారా అని తెలుసుకోవచ్చు.

21వ విడత విడుదల ఎప్పుడు..?

ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడతను విడుదల చేయలేదు. దీనికి సంబంధించిన అధికారిక తేదీని కూడా ప్రకటించలేదు. నవంబర్ 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.