పౌరసత్వ సవరణ చట్టం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ.. ర్యాలీలు కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏతో పాటుగా.. ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను కూడా వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు.. ఈ నిరసనల్లోకి అయోధ్య అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఎన్నార్సీ విషయంలో డాక్యుమెంట్లు చూపనోళ్లు.. శ్రీరాముడి ఉనికికి ఆధారాలేంటి అని అడుగుతున్నారంటూ సెటైర్లు వేశారు. శ్రీరాముడు అయోధ్యలో పుట్టారన్నది కొన్ని వేల ఏళ్ళ నాటి విశ్వాసమని.. అయితే దీన్ని కొందరు కావాలనే ఆధారాలేంటి అని అడుగుతున్నారన్నారు.
గుజరాత్‌లోని వడోదరలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిచిన సందర్భంగా.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్పీఆర్ కోసం ప్రభుత్వం డాక్యుమెంట్ల చూపాలని కోరితే.. చూపేదే లేదంటూ తేల్చిచెబుతున్నారు. అలా అనేవాళ్లే… అయోధ్యలో రాముడి ఉనికి కోసం ఆధారాలు చూపాలంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. “అయోధ్యలో ధ్వంసం చేసిన కట్టడం ఉన్న ప్రాంత రామజన్మభూమి” అని సుప్రీం కోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.