Payments Bank Deposit: పేమెంట్స్ బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. డిపాజిట్ పరిమితిని పెంచుతూ బుధవారం ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ పేమెంట్స్ డిపాజిట్ లిమిట్‌ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందంటూ పేర్కొంది. దీంతో పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు లాభం చేకూరుతుందని.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీనివల్ల చిన్న తరహా వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించారు. అంతకు ముందు లక్ష రూపాయల లిమిట్ మాత్రమే ఉండటంతో చిన్న తరహా వ్యాపారులు ఇబ్బందులు పడేవారని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి మేలు జరుగుతుందన్నారు.
అయితే.. ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. రెపో రేటు, వడ్డీ రేట్లను యథాతధంగానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ లిమిట్‌పై కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు డిపాజిట్ పేమెంట్స్ పరిమితిని పెంచాలంటూ బ్యాంకులు ఆర్‌బీఐకి విన్నవించాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. 2015లో ఆర్‌బీఐ.. పేమెంట్స్ బ్యాంకుల ఏర్పాటుకు 11 సంస్థలకు సూత్రప్రాయ ఆమోదం అందించింది.
నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి సర్వీసులను కూడా డిజిటల్ పేమెంట్స్ ఇంటర్ మీడియరీస్‌కు అందుబాటులో ఆర్‌బీఐ వెల్లడించింది. ఇప్పటివరకు కేవలం బ్యాంకులకు మాత్రమే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ పేమెంట్స్ సౌకర్యం ఉంది.
Also Read: