ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఉస్మాన్ జట్ అలియాస్ ‘చిని’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాశ్మీర్‌లో స్లీపర్ సెల్ నెట్‌వర్క్ బలోపేతానికి భారత్‌లోకి చొరబడిన అతడు, తన గుర్తింపును మార్చుకునేందుకు శ్రీనగర్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఓజీడబ్ల్యూ నెట్‌వర్క్ సహాయంతో క్లినిక్‌లో చికిత్స పొందిన అతడు, తర్వాత నకిలీ పత్రాలతో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.

ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..
Lashkar E Taiba Terrorist

Edited By:

Updated on: May 18, 2026 | 11:20 AM

అతనొక ఉగ్రవాది. పాకిస్తాన్‌లో పూర్తిస్థాయి శిక్షణ పొందాడు. జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడంతో పాటు దేశవ్యాప్తంగా ‘స్లీపర్ సెల్’ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం కోసమే చొరబడి మరీ వచ్చాడు. ఉగ్రవాద దాడులు పక్కన పెట్టి, సదరు ఉగ్రవాది తన వ్యక్తిగత రూపాన్ని మార్చుకోవడానికి శ్రీనగర్‌లో రహస్యంగా ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ (జుట్టు మార్పిడి శస్త్రచికిత్స) చేయించుకోవడం భద్రతా సంస్థలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎవరు ఈ ‘చిని’? విచారణలో ఏం తేలింది?

భద్రతా దళాల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్ జట్ అలియాస్ చిని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) లో శిక్షణ పొందాడు. గత నెలలో శ్రీనగర్ పోలీసులు లష్కర్‌కు చెందిన మరో కీలక ఉగ్రవాది అబ్దుల్లా అలియాస్ అబూ హురైరాతో పాటు అరెస్ట్ చేశారు. ఈ కేసు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో ముడిపడి ఉండటంతో ప్రస్తుతం NIA దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది.

కశ్మీర్ రాగానే మారిన ఆలోచన!

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో కశ్మీర్ గురించి తనకు మైండ్ వాష్ చేశారని విచారణలో చెప్పాడు. అయితే శిక్షణలో తనకు చెప్పిన విషయాలకు, వాస్తవంలో కాశ్మీర్ లోయలోని పరిస్థితులకు అసలు పొంతనే లేదని వెల్లడించాడు. ఉత్తర కశ్మీర్ మార్గం నుంచి భారత్‌లోకి చొరబడిన తర్వాత ఇక్కడి సాధారణ ప్రజల జీవితాలను, శాంతియుత వాతావరణాన్ని చూసి తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని అతడు పేర్కొన్నాడు. జమ్మూ-కశ్మీర్ వెలుపల కూడా పెద్ద ఎత్తున స్లీపర్ సెల్‌లను తయారు చేయాలనే లక్ష్యంతో వచ్చినప్పటికీ, ఇక్కడి వాస్తవ పరిస్థితులు చూశాక తన అభిప్రాయం మారిపోయిందని వివరించాడు.

బట్టతల సమస్య.. శ్రీనగర్‌లో ట్రీట్‌మెంట్!

విచారణలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉస్మాన్ జట్ గత కొంతకాలంగా తీవ్రమైన జుట్టు రాలడం (బట్టతల) సమస్యతో బాధపడుతున్నాడు. దీనివల్ల అతడు మానసికంగా కుంగిపోవడమే కాకుండా, ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయాడు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది కేవలం పాశ్చాత్య దేశాలలో ఉండే ఖరీదైన ప్రక్రియ అని అతడు భావించేవాడు.

అయితే, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్న సమయంలో లష్కర్ ఉగ్రవాదులు జర్గామ్, అబు హురైరాతో ఇతడికి పరిచయం ఏర్పడింది. అక్కడ ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (OGW) నెట్‌వర్క్ సహాయంతో నగరంలోని ఒక నమ్మకస్థుడైన దుకాణదారుడిని కలిశాడు. ఆ దుకాణదారుడు స్వయంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడని తెలియడంతో, ఉస్మాన్ కూడా తనకు సహాయం చేయమని కోరాడు. ఆ దుకాణదారుడి సహాయంతో శ్రీనగర్‌లోని ఒక ప్రముఖ క్లినిక్‌లో రహస్యంగా ఉస్మాన్‌కు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగింది. ఈ ప్రక్రియ కోసం ఆ ఉగ్రవాది క్లినిక్‌లోనే కొన్ని రాత్రులు గడపడం గమనార్హం.

జమ్మూ నుంచి పంజాబ్ వరకు ప్రయాణం:

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఉస్మాన్ జట్ తన సహచరుడు అబు హురైరాతో కలిసి ఒక ప్యాసింజర్ వాహనంలో జమ్మూకు చేరుకున్నాడు. అక్కడి నుండి స్లీపర్ బస్సు ద్వారా పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు వెళ్లాడు. పంజాబ్‌లో తలదాచుకున్న సమయంలో అతడు టర్కిష్ వెబ్ సిరీస్‌లు చూడటం, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించడం లాంటివి చేశాడని దర్యాప్తులో తేలింది.

నకిలీ పత్రాలతో విదేశాలకు పారిపోయే ప్లాన్:

భారతదేశంలో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి, తద్వారా పాస్‌పోర్ట్ పొంది విదేశాలకు పారిపోవాలనేది ఉస్మాన్ అసలు వ్యూహం. గతంలో 2012లో భారత్‌లోకి చొరబడి, 2024లో జైపూర్ నుండి నకిలీ పాస్‌పోర్టుతో ఇండోనేషియా, గల్ఫ్ దేశాలకు పారిపోయిన ఉమర్ అలియాస్ ‘ఖర్గోష్’ (కరాచీకి చెందినవాడు) తరహాలోనే తాను కూడా దేశం దాటాలని ప్లాన్ చేసినట్లు ఉస్మాన్ అంగీకరించాడు.

బట్టబయలైన ఉగ్ర నెట్‌వర్క్:

ఉస్మాన్ జట్ ఇచ్చిన సమాచారంతో శ్రీనగర్, ఉత్తర కశ్మీర్‌లో చురుగ్గా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఓవర్‌గ్రౌండ్ వర్కర్ల (OGW) నెట్‌వర్క్ పెద్ద ఎత్తున బట్టబయలైంది. భద్రతా దళాలు అతడి క్లూస్ ఆధారంగా పలువురు అనుమానితులను, ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించే పనిలో పడ్డాయి.

గత నవంబర్ 2025 లోనే శ్రీనగర్ పోలీసులు ‘అల్ ఫలాహ్ మాడ్యూల్’ను ఛేదించి, అందులో డాక్టర్లతో సహా పలువురు విద్యావంతులు ఉగ్రవాద భావజాలంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఘటన ఉగ్రవాదుల కొత్త తరహా వ్యూహాలను, స్థానిక నెట్‌వర్క్ లోతును స్పష్టం చేస్తోంది. ఈ కేసుపై ఎన్ఐఏ (NIA) మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తును ముమ్మరం చేసింది.

 

Follow Us