Pakistan News: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలులో ఉండగా.. ఇకపై 6 రోజుల పనిదినాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపై వారంలో రెండు రోజులు సెలవులు ఉండవోవని.. ఒక అధికారిక వారపు సెలవు మాత్రమే ఉంటుందని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ పని గంటలను కూడా 10 గంటలకు పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం కథనాలు ప్రసారం చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి.
దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో షెహబాబ్ షరీఫ్ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం పాకిస్తాన్ కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుందని ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలను వెనక్కి తీసుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తనకు విషెస్ తెలిపినందుకు షెహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. భారత్‌తో శాంతియుత సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ సహా అన్ని దీర్ఘకాలిక సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. తీవ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగాలు అందరికీ తెలిసిందేనంటూ ప్రధాని మోడీ ట్వీట్‌పై స్పందిస్తూ షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ చేశారు.
Thank you Premier Narendra Modi for felicitations. Pakistan desires peaceful & cooperative ties with India. Peaceful settlement of outstanding disputes including Jammu & Kashmir is indispensable. Pakistan’s sacrifices in fighting terrorism are well-known. Let’s secure peace and.. https://t.co/0M1wxhhvjV
— Shehbaz Sharif (@CMShehbaz) April 12, 2022
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ షరీఫ్ ఆ దేశ 23వ ప్రధానమంత్రిగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఎన్నికైన తర్వాత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం గట్టెక్కడంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోవడం తెలిసిందే.
Also Read..
Acharya Trailer: మెగాస్టారా మజాకా.. దుమ్మురేపిన చిరు- చరణ్.. అదిరిపోయిన ‘ఆచార్య’ ట్రైలర్..
Andhra Pradesh: ఆంధ్రాలో కరోనా ఆల్మోస్ట్ ఖతం.. కొత్తగా కేవలం 2 అంటే 2 కేసులు.. కంప్లీట్ వివరాలు