PoKలో పాక్ సైన్యం అరాచకం? పౌరులపై డ్రోన్ దాడులు.. ఏడుగురు మృతి!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న నిరసనలను అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు భారీ చర్యలకు దిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రావల్కోట్ ప్రాంతంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

PoKలో పాక్ సైన్యం అరాచకం? పౌరులపై డ్రోన్ దాడులు.. ఏడుగురు మృతి!
Pok Violence

Updated on: Nov 05, 2026 | 5:44 PM

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న నిరసనలను అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు భారీ చర్యలకు దిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రావల్కోట్ ప్రాంతంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

గురువారం (నవంబర్ 05) ఉదయం రావల్‌కోట్ బస్ టెర్మినల్ పరిసరాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు రేంజర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) బలగాలు చర్యలు ప్రారంభించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయని, డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలను ప్రయోగించినట్లు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. నిరసన ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న సర్దార్ ఉమర్ నజీర్, ఉమర్ ఫరూఖ్ చౌక్ వద్ద పేలుడు పదార్థాలకు సంబంధించిన శకలాలను ప్రదర్శించారు. పౌరుల ఇళ్లు, నిరసన ప్రదేశాలపై దాడులు జరిగాయంటూ ఆయన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, నిరసనకారులు పాకిస్తాన్ సైన్యం ఉపయోగించినట్లు ఆరోపిస్తున్న RPG-7 రాకెట్‌కు సంబంధించిన తోక భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిరసనకారులపై కేవలం తుపాకీ కాల్పులే కాకుండా భారీ ఆయుధాలు కూడా ఉపయోగించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఘటనలో ఏడుగురు నిరసనకారులు మరణించగా, 23 మంది తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, పోలీసులు నిరసనకారులే తొలుత దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, భద్రతా బలగాల చర్యలను సమర్థించుకుంటున్నారు.

పోలీసుల ప్రకటనలో డ్రోన్ దాడులు, RPG-7 రాకెట్ల ప్రయోగంపై స్పష్టమైన వివరణ లేదని నిరసన వర్గాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఉమర్ ఫరూఖ్ చౌక్ వద్ద నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. పాకిస్తాన్ సైన్యం, రేంజర్స్, FC బలగాలకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. మరోవైపు, గతంలో కూడా రావల్‌కోట్‌లో జరిగిన ఘర్షణలపై ఇరువర్గాలు పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మానవ హక్కుల పరిరక్షణ వర్గాలు కోరుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us