
ప్రస్తుతం మన దేశంలోని జిల్లా, కింది కోర్టుల్లోనే ప్రస్తుతం 5.18 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 4.05 కోట్లకు పైగా క్రిమినల్ కేసులు కాగా.. 1.12 కోట్లకు పైగా సివిల్ కేసులు ఉన్నాయి. అంటే కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటిలో కొన్నింటికి త్వరగానే పరిష్కారం దొరుకుతోంది. మరికొన్ని మాత్రం ఏళ్ల తరబడి అలాగే నడుస్తున్నాయి.
ఏళ్లుగా అదే పని..
కేసు మొదలైన తర్వాత వాయిదా పడటం. మళ్లీ మరో రోజు రావడం. ఆ రోజు కోర్టుకు వెళ్లడం.ఇలా రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోతుంటాయి. ఒకసారి వాయిదా పడితే సమస్య అక్కడితో ఆగదు. పని మానుకుని కోర్టుకు రావాలి. ప్రయాణ ఖర్చు పెట్టాలి. న్యాయవాది ఖర్చు భరించాలి. ఇలా ప్రతి తేదీ సామాన్యుడికి భారంగా మారుతుంది. ప్రస్తుతం దేశంలోని కింది కోర్టుల్లో 5 నుంచి 10 ఏళ్లుగా నడుస్తున్న కేసులు 83 లక్షలకు పైగా ఉన్నాయి. పదేళ్లు దాటిన కేసులు 47 లక్షలకు పైగా ఉన్నాయి. అంటే పాత కేసుల భారం కూడా కొండవీటి చాంతాడులా చాలా పెద్దదిగానే ఉంది.
తెలంగాణలోనూ పెద్ద భారం
తెలంగాణ హైకోర్టులోనూ కేసుల సంఖ్య 2.36 లక్షలకు పైగానే ఉంది. ఇందులో లక్షకు పైగా కేసులు ఐదేళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నాయి. అంటే కొత్త కేసులు వస్తున్నా పాత కేసులు పూర్తిగా తగ్గడం లేదు. గత కొన్నేళ్ల లెక్కలు చూస్తే కొన్ని తగ్గుతున్నాయి. 2021లో 2.40 లక్షల కేసులు ఉండగా.. 2024లో 2.29 లక్షలకు తగ్గాయి. కానీ 2025 చివరికి మళ్లీ 2.33 లక్షలకు చేరాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గించడమే కాకుండా, పాత కేసులు త్వరగా పూర్తి చేయడంపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రతి లెక్క వెనుక ఒక బతుకు
కోర్టు లెక్కల్లో ఒక కేసు అంటే ఒక సంఖ్య మాత్రమే. కానీ ఆ కేసు వెనుక ఒక కుటుంబం ఉండొచ్చు. ఆస్తి గొడవ కావచ్చు. డబ్బు సమస్య కావచ్చు. ఉద్యోగం, కుటుంబ సమస్య, ప్రమాదం లేదా మరో ఇబ్బంది కావచ్చు. తీర్పు ఆలస్యం అయితే సమస్య కూడా అలాగే కొనసాగుతుంది. ఆస్తి విషయంలో అయితే ఆ భూమి ఎవరికి దక్కుతుందో తెలియదు. డబ్బు విషయం అయితే రావాల్సిన మొత్తం చేతికి అందదు. కుటుంబ సమస్య అయితే ఇంట్లో గొడవ అలాగే ఉంటుంది. అందుకే కేసు త్వరగా పూర్తవ్వడం చాలా ముఖ్యం.
తగ్గించేందుకు ప్రయత్నాలు
కేసుల సంఖ్య తగ్గించేందుకు ఇప్పటికే కొన్ని మార్గాలు అమల్లో ఉన్నాయి. లోక్ అదాలత్‌ల ద్వారా ఇరువర్గాలు మాట్లాడుకుని సమస్యను ముగించుకునే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ సాయం అవసరమైన వారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు.
తెలంగాణలో 2025లో లోక్ అదాలత్‌ల ద్వారా 62.96 లక్షలకుపైగా విషయాలు పరిష్కరించారు. అంటే కోర్టుకు వెళ్లిన ప్రతి సమస్య చివరి వరకు కేసుగా నడవాల్సిన అవసరం లేదన్నది ఇందులో కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో పత్రాలు పంపడం, వీడియో ద్వారా విచారణ, కోర్టు పనులను కంప్యూటర్‌లోకి తీసుకురావడం వంటి మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇవి సమయం, ఖర్చు తగ్గించడంలో ఉపయోగపడుతున్నాయి.
ఇంకా ఏం చేయాలి?
ఈ పెండింగ్ కేసులను మరింత తగ్గించాలంటే ఏం చేయాలి.. అంటే పాత కేసులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఐదేళ్లు, పదేళ్లు దాటిన కేసులను ప్రత్యేకంగా చూసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు ఉండాలి. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలి. కోర్టుల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాలు పెంచాలి. అవసరం లేని వాయిదాలు తగ్గాలి. పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి రావాల్సిన నివేదికలు సమయానికి రావాలి. సాక్షులు సమయానికి హాజరయ్యేలా చూడాలి. రెండు వర్గాలు మాట్లాడుకుని సమస్యను ముగించుకునే కేసులను లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం వైపు తీసుకెళ్లాలి.
కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండొచ్చు. కానీ ఆ కేసు వెనుక ఉన్న మనిషి జీవితం మాత్రం ఆగదు. అందుకే కేసుల సంఖ్య తగ్గించడం ఒక్కటే కాదు.. ఏళ్లుగా నడుస్తున్న కేసులకు త్వరగా ముగింపు ఇవ్వడమే అసలు లక్ష్యం కావాలి. కేసు పెట్టడం ఒక రోజు పని కావచ్చు. కానీ న్యాయం కోసం ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తే.. సామాన్యుడికి న్యాయం ఎప్పుడనే ప్రశ్న తలెత్తుతోంది.
కొండవీటి శివనాగరాజు
డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్,టీవీ9.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.