సమరోత్సాహంతో బెంగాల్‌ ఎన్నికల బరిలో దిగనున్న బీజేపీ

|

Oct 01, 2020 | 11:52 AM

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పుతో బీజేపీ ఆత్మవిశ్వాసం మూడు రెట్లు పెరిగింది.. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పడంతో...

సమరోత్సాహంతో బెంగాల్‌ ఎన్నికల బరిలో దిగనున్న బీజేపీ
Follow us on

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పుతో బీజేపీ ఆత్మవిశ్వాసం మూడు రెట్లు పెరిగింది.. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పడంతో ఇన్నాళ్లుగా ఆ నిందను మోస్తున్నవారికి ఊరట కలిగింది.. ఈ తీర్పుతో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో కదనోత్సాహంతో దిగబోతున్నది బీజేపీ.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీకి ఎంతో అవసరం.. అలాగే దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు జరగబోతున్న ఉప ఎన్నికలలో అత్యధిక సీట్లు గెల్చుకోవాలన్నది బీజేపీ లక్ష్యం.. మధ్యప్రదేశ్‌లోని 24 అసెంబ్లీ సీట్లకు జరిగే బై ఎలెక్షన్స్‌లో కనీసం 20 స్థానాలనైనా గెల్చుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారు కమలనాథులు.. మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలలో విజయం సాధిస్తే పార్ట మార్పిడికి ప్రజల ఆమోదయోగ్యం ఉన్నట్టేనని భావించాల్సి ఉంటుంది.. బీజేపీకి కూడా అదే కావాలి.. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయి.. ఇవి భారతీయ జనతాపార్టీకి అత్యంత కీలకం.. అలాగే పంజాబ్‌ కూడా… పంజాబ్‌ను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం లేదు కానీ.. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలపై మాత్రం బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది.. ఈసారి ఎలాగైనా బెంగాల్‌ను చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు.. అసలు బెంగాల్‌లో బీజేపీ ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించలేదు. అలాంటిది 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాలను గెల్చుకుంది. రెండు స్థానాల నుంచి 18 స్థానాలకు ఎగబాకడం అన్నది మామూలు విషయం కాదు.. బీజేపీకి ఏ మాత్రం పట్టులేదనుకుంటే 40.64 శాతం ఓట్లను సంపాదించింది.. 2014 ఎన్నికలలో 34 లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో మాత్రం 22 స్థానాలలోనే విజయం సాధించింది.. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు నానాటికి తీసికట్టు నాగంబొట్లుగా మారింది.. బెంగాల్‌లో బీజేపీ ఇంతగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఊహించి ఉండరు. అందుకే ఆమెలో ఆందోళన మొదలయ్యింది. ఎన్నికలకు అట్టే సమయం కూడా లేదు.. ఇంకో ఆరు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.. అందుకే ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టారు మమతా బెనర్జీ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్న మమతా బెనర్జీ పకడ్బందీ ప్రణాళికలను రచించుకుంటున్నారు. బాబ్రీ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడంతో బీజేపీ మరింత ఉత్సాహంతో క్షేత్రరంగంలోకి దూకే అవకాశం ఉంది.. ఇంతకాలం తమను ఆడిపోసుకున్న విపక్షాలు ఇప్పుడేం సమాధానం చెబుతాయని నిలదీస్తున్నారు కమలనాధులు.. ఇదే విషయాన్ని బెంగాల్ ఎన్నికలలో ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు బీజేపీ నాయకులు.