నాగాలాండ్, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నాగా రాజకీయ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు నాగాలతో తదుపరి శాంతి చర్చలు ఈ నెల 31 న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు చేపట్టాయి. పోలీసు, భద్రతా దళాలను సర్వ సన్నద్దం చేశాయి.తమ సిబ్బందికి అన్ని రకాల సెలవులను రద్దు చేస్తూ నాగాలాండ్ రాజధాని కోహిమాలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మణిపూర్ లో సెక్యూరిటీ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. రాజధాని ఇంఫాల్ లోని రాజ్ భవన్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో పోలీసు బలగాలను మోహరించారు. ఏడు దశాబ్దాలుగా సాగుతున్న నాగా ఇన్ సర్జెన్సీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ నెల 24 న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఈ నెల 31న మళ్ళీ శాంతి చర్చలు జరపాలని నిర్ణయించారు.
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన అనంతరం.. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా నాగాలాండ్ లో అనిశ్చితి ఏర్పడింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 371 (ఏ) కింద ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక హక్కులను పొందుతోంది. ఈ హక్కులను కేంద్రం కాల రాయవచ్చునని నాగాలు భయపడుతున్నారు. నాగా ప్రతిపత్తికి సంబంధించి ప్రత్యేక పతాకం, రాజ్యాంగం ఉండాలని నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ డిమాండ్ చేస్తోంది.