New Parliament Building: కాంగ్రెస్ పార్టీది ద్వంద వైఖరి.. జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ధ్వజం

|

May 27, 2023 | 8:35 AM

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము చేతులమీద కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సహా 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

New Parliament Building: కాంగ్రెస్ పార్టీది ద్వంద వైఖరి.. జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ధ్వజం
New Parliament Building
Follow us on

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చుట్టూ జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము చేతులమీద కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సహా 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే విపక్షాల బహిష్కరణ నిర్ణయాన్ని బీజేపీ సహా ఎన్టీయే భాగస్వామ్యపక్షాలు తప్పుబట్టాయి. వైసీపీ, టీడీపీ, బీజేడీ, బీఎస్పీ, అకాలీదళ్, లోక్ జనశక్తి(పాశ్వాన్) తదితర విపక్ష పార్టీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించాయి. తాజాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని జేడీఎస్ నిర్ణయం తీసుకుంది.

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడాన్ని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. తమ పార్టీ కాంగ్రెస్‌కు బానిస కాదని, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందన్నారు. 28న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి జేడీఎస్ హాజరవుతుందని ప్రకటించారు. నూతన పార్లమెంటు భవనం ఒక రాజకీయ పార్టీ నిధులతో నిర్మించింది కాదని.. దేశంలోని ఎంతో మంది పన్ను చెల్లింపుదారుల పన్నులతో నిర్మించిందని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ భవనానికి గవర్నర్ కాకుండా సోనియా, రాహుల్ గాంధీ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. అలాగే కర్ణాటక విధాన సౌధను 2005లో గవర్నర్ కాకుండా నాటి సీఎం ధరమ్‌సింగ్ ప్రారంభించారని గుర్తుచేశారు.

కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. గత ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికలను జేడీఎస్ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలని ప్రశ్నించారు. తాన్ని మర్చిపోయి మాట్లాడటం సరికాదన్నారు. పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని కాకుండా రాష్ట్రపతి ముర్ము ప్రారంభించాలన్నారు.