
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారుల పనులను చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యాన్ని విడనాడాలని, తక్షణమే పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు జాతీయ రహదారుల కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.ఉత్తర తెలంగాణలో జాతీయ రహదారుల హబ్‌గా కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు ఎస్.ఈ. ఆఫీసును కరీంనగర్ లో ప్రారంభించినట్లు తెలిపారు.
అందులో మొదటిది మెదక్ – సిద్ధిపేట – ఎల్కతుర్తి 133 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం. 2016 నవంబర్ 24 న సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినా ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయిందని ఆరోపించారు. రెండోది కరీంనగర్ – సిరిసిల్ల – ఎల్లారెడ్డి – పిట్లం164 కిలోమీటర్ల జాతీయ రహదారి. 2016 ఫిబ్రవరి 16 న సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినా ఇప్పటికీ ప్రారంభం కాలేదని విమర్శించారు. మూడో రహదారి జంక్షన్ 353 సీ నుంచి భూపాలపల్లి – అంశాన్ పల్లి – గొర్లవీడు -, నెరేడ్ పల్లి – గర్మిళపల్లి -బూరపల్లి – ఎమ్పెడ్ – వావిలాల – జమ్మికుంట – వీణవంక – కరీంనగర్ 131 కిలోమీటర్ల జాతీయ రహదారిగా సూత్రప్రాయంగా అంగీకరించారు. 2, 4, 6 లేన్స్‌గా అప్ గ్రేడ్ చేస్తామని 2017 ఆగస్టు 31 న చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నాలుగో రహదారి సిరిసిల్ల – సిద్దిపేట – దుద్దేడ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా నంబర్ 365 బీగా ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 16 న సమాచారాన్ని ఇచ్చి డీ.పీ.ఆర్. ను సిద్ధం చేయనున్నట్లు తెలిపారని, కానీ ఇప్పటి వరకు ఆ సంగతే మరిచిపోయారని ఎద్దేవా చేశారు.