NEET UG 2026 Re-Exam: నీట్ రీఎగ్జామ్.. పేపర్ సెట్టర్స్ లాక్‌డౌన్.. లీక్ అవ్వకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు..

మరో రెండు వారాల్లో జరగబోయే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఊహించని రేంజ్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. గతంలో జరిగిన పేపర్ లీక్ మచ్చను చెరిపేసుకోవడానికి ఈసారి ఏకంగా ప్రశ్నపత్రాలు తయారు చేసే నిపుణులనే ఒక రహస్య ప్రదేశంలో లాక్‌డౌన్ చేసింది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు లేవు.. బయటి ప్రపంచంతో అస్సలు సంబంధమే లేకుండా వాళ్లు ఉంటారు.

NEET UG 2026 Re-Exam: నీట్ రీఎగ్జామ్.. పేపర్ సెట్టర్స్ లాక్‌డౌన్.. లీక్ అవ్వకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు..
Neet Ug Reexam Paper Setters Under Strict Lockdown

Updated on: Jun 08, 2026 | 1:42 PM

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్‌కు ముహూర్తం దగ్గరపడుతుండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసాధారణమైన భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది. మే 3న జరిగిన మొదటి పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్‌టీఏ.. ఈసారి జూన్ 21న జరగబోయే రీ టెస్ట్ విషయంలో జీరో ఎర్రర్ పాలసీని అమలు చేస్తోంది. పేపర్ లీకేజీకి అస్సలు ఛాన్స్ లేకుండా పేపర్ తయారీ దశ నుంచే ఊహించని రేంజ్‌లో కట్టుదిట్టమైన కమాండో తరహా భద్రతను ఏర్పాటు చేసింది.

రహస్య ప్రదేశంలో నిపుణుల లాక్‌డౌన్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రాల తయారీలో భాగస్వాములైన సబ్జెక్ట్ నిపుణులు, పర్యవేక్షకులు, వివిధ భాషల్లోకి అనువదించే ట్రాన్స్‌లేటర్లతో కూడిన యావత్ టీమ్‌ను కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో ఒక అత్యంత రహస్య ప్రాంతంలో లాక్‌డౌన్ చేశారు. ఈ లాక్‌డౌన్ ప్రాంగణంలో ఉన్నవారికి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచీలు లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ఎలాంటి కమ్యూనికేషన్ పరికరాలనూ అనుమతించడం లేదు. కేవలం ముందస్తు అనుమతి పొందిన ప్రత్యేక సిబ్బందికి మాత్రమే ఈ జోన్‌లోకి ప్రవేశం ఉంటుంది. జూన్ 21న పరీక్ష ముగిసేంతవరకు ఈ నిపుణుల బృందం బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఇదే నిఘా నీడలో గడపనుంది.

వాయుసేన విమానాల్లో పేపర్ల రవాణా..

గతంలో రవాణా, స్టోరేజ్ దశల్లోనే లీకేజీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో.. ఈసారి ఎన్‌టీఏ సరికొత్త మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను రంగంలోకి దించింది. క్వశ్చన్ పేపర్ల ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్ నుంచి పరీక్షా కేంద్రాలకు చేరే వరకు ప్రతి దశలోనూ బహుళ అంచెల నిఘా ఉంటుంది. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే.. ఈ ప్రశ్నపత్రాల రవాణా కోసం ఈసారి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రైవేట్ రవాణా సంస్థల జోక్యం తగ్గి.. పేపర్లు అత్యంత సురక్షితంగా జిల్లాలకు చేరుకుంటాయి.

లీక్ రూమర్స్ నమ్మొద్దు

ఇదిలా ఉండగా.. రీ ఎగ్జామ్ పేపర్ కూడా ముందే లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టడంపై ఎన్‌టీఏ తీవ్రంగా స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని, మోసపూరితమైనదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను నమ్మి అభ్యర్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఫేక్ ప్రచారం చేసే అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

జూన్ 21న 551 నగరాల్లో రీ టెస్ట్..

దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షలో లీకేజీ కలకలం రేగడంతో.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మే 12న ఆ పరీక్షను ఎన్‌టీఏ అధికారికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ జరగనుంది. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగించేందుకు కేంద్ర విద్యాశాఖ, ఎన్‌టీఏ సర్వసన్నద్ధమయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us