‘SORRY అమ్మా.. ఈసారి బాధపెట్టను’ NEET 2026 రీ-ఎగ్జామ్ రాసిన కాసేపటికే విద్యార్థి ఆత్మహత్య

NEET 2026 Aspirant Dies by Suicide: మరో నీట్‌ అభ్యర్ధి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.18 ఏళ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. రీ-ఎగ్జామినేషన్ రాసిన కొద్దిసేపటికే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మరణానికి ముందు తల్లికి పంపిన వీడియో సందేశం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. వివరాల్లోకెళ్తే..

SORRY అమ్మా.. ఈసారి బాధపెట్టను NEET 2026 రీ-ఎగ్జామ్ రాసిన కాసేపటికే విద్యార్థి ఆత్మహత్య
Maharashtra Neet Aspirant Emotional Video Message

Updated on: Jun 26, 2026 | 1:17 PM

మహారాష్ట్ర, జూన్ 26: మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాకు చెందిన సుశీల్ ధాగే (18) జూన్ 21న నిర్వహించిన నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యాడు. గతంలో మే 3న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో, మళ్లీ పరీక్ష నిర్వహించారు. దీంతో రెండోసారి కూడా సుశీల్ పరీక్షకు హాజరయ్యాడు. ఆత్మహత్యకు ముందు సుశీల్ తన మొబైల్ ఫోన్‌లో 33 సెకన్ల నిడివి గల వీడియోను రికార్డ్ చేసి కుటుంబ సభ్యులకు పంపించాడు. ఆ వీడియోలో తల్లికి క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వీడియోలో.. ‘అమ్మా.. నేను ఈరోజు చనిపోతున్నాను. నువ్వు బాధపడకు. వచ్చే జన్మలో మళ్లీ నీ కడుపునే పుడతాను. నీకు ఇలాంటి బాధ మళ్లీ కలిగించను. నన్ను క్షమించు అమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు. నా గురించి ఆందోళన చెందకు. నేను చాలా బాధలో ఉన్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు’ అని కన్నీటి పర్యంతమవుతూ వీడియోలో చెప్పాడు. ఈ వీడియోను కుటుంబ సభ్యులకు పంపిన కొద్దిసేపటికే సుశీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రశ్నపత్రం లీక్‌ ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంటుందో?

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష మే 3న జరిగింది. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వెల్లువెత్తడంతో మే 12న పరీక్షను రద్దు చేశారు. ఈ కేసును Central Bureau of Investigation విచారణ చేపట్టింది. లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణేకు చెందిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం జూన్ 21న రీ-ఎగ్జామినేషన్ నిర్వహించారు. దేశంలో అత్యంత పోటీ పరీక్షల్లో ఒకటైన నీట్‌కు ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతారు. సుమారు లక్ష మెడికల్ సీట్ల కోసం మిలియన్ల మంది పోటీపడుతుండటంతో విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడుతోంది. తాజా ఘటన మరోసారి విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పరీక్షల ఒత్తిడి, పోటీ విద్యా వ్యవస్థపై చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఆత్మహత్య ఆలోచనలు, తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నవారు కుటుంబ సభ్యులు, స్నేహితులు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఒంటరిగా బాధను మోయాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలు ఇతరులతో పంచుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Follow Us