ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బీభత్సాన్ని సృష్టించారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 9 వాహనాలకు నిప్పుపెట్టారు. ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక ఎన్ఎండీసీ ప్లాంట్ పనులు జరుగుతుండగా.. కొందరు మావోయిస్టులు ఆయుధాలతో వచ్చి.. పనులు చేస్తున్న వారిని బెదిరింపులకు గురిచేశారు. అనంతరం అక్కడ ఉన్న వాహనాలన్నింటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మొత్తం మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లు పూర్తిగా కాలిపోయాయి. అక్కడ జరుగుతున్న ప్లాంట్ పనులకు వ్యతిరేకంగా ఈ విధ్వంసానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంతలోనే మావోయిస్టులు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే మావోలు నిప్పు పెట్టిన వాహనాలన్నీ.. ప్లాంట్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది.
మరోవైపు శనివారం కూడా నారాయణపూర్ జిల్లాలో కూడా దాదాపు ఇలాంటి ఘటనే రిపీట్ అయ్యింది. చిన్న డోంగార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మార్హోనార్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు.