MSRTC Protest At Sharad Pawar Home: మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి చాణక్యుడి వంటివాడు ఆయన. కానీ ఆర్టీసీ కార్మికుల ఆగ్రహాన్ని చవిచూశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (MSRTC) ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంస్థకు చెందిన కార్మికులు ముంబైలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని చుట్టుముట్టారు. దక్షిణ ముంబైలోని పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో ఇచ్చిన హామీని పవార్ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం పట్టలేక పవార్ ఇంటిపై రాళ్లు, చెప్పులు, బూట్లు విసిరారు. అడ్డుకున్న ఎన్సీపీ కార్యకర్తలపై కూడా రాళ్లు, చెప్పులు విసరడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శరద్‌పవార్ కూతురు ఎంపీ సుప్రియా సూలే ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినలేదు. అక్కడికి చేరుకున్న పోలీసులు MSRTC ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం104 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. NCP చీఫ్ శరద్ పవార్ ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ నివాసంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం పోలీసు శాఖను ఆదేశించారు. నాయకులు, వారి కుటుంబాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భం మహారాష్ట్రలో ఎప్పుడూ లేదని థాకరే పేర్కొన్నారు. దాడిని ప్రేరేపించినవారు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరాను. సమ్మె చేస్తున్న కార్మికుల డిమాండ్‌లను తమ ప్రభుత్వం ఏనాడూ విస్మరించలేదని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు.
కాగా.. ఈ ఆందోళన తరువాత శరద్‌పవార్ నివాసం దగ్గర భద్రతను పెంచారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత నవంబర్ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె మొదలైనప్పటి నుంచి 120 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కార్మిక నాయకులు చెప్పారు. ఇవన్నీ ఆత్మహత్యలు కావని, ప్రభుత్వ విధానం వల్ల జరిగిన హత్యలని ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించేందుకు పవార్ ఏ కృషి చేయలేదని మండిపడ్డారు.
అయితే.. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 22 లోగా విధుల్లో చేరాలని వాళ్లకు హైకోర్టు డెడ్‌లైన్ కూడా విధించింది. ఉద్యోగాల్లో తిరిగి చేరేవాళ్లపై ఎలాంటి చర్యలు ఉండవని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కరించడం లేదని ఎంఎస్‌ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.
Also Read: