ధోని పుట్టిన రోజే నా కంపెనీ పుట్టింది: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

| Edited By:

Aug 18, 2020 | 12:12 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, అంతర్జాతీయ క్రికెట్‌కి ఆగష్టు 15న రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ధోని పుట్టిన రోజే నా కంపెనీ పుట్టింది: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
Follow us on

Narayana Murthy Tribute Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, అంతర్జాతీయ క్రికెట్‌కి ఆగష్టు 15న రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ధోనికి ఇన్ఫోసిస్ ఫౌండర్‌ నారాయణ మూర్తి సైతం ట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ జాతీయ పత్రికలో ఓ కాలమ్‌ రాసిన ఆయన పలు ఆసక్తికర విషయాలను  పంచుకున్నారు. అందులో ధోని పుట్టిన రోజే తన కంపెనీ కూడా స్థాపించబడిందని ఆయన అన్నారు. అంతేకాదు ధోని, తన కంపెనీ మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయని నారాయణ మూర్తి వెల్లడించారు.

”ధోని గురించి చెప్పాలంటే ఆయన ఆట తీరే కాదు ఇంకా చాలా ఉన్నాయి. 1.3మిలయన్‌ భారతీయుల ఆశలను ధోని పెంచారు. ధోని వలన ప్రతి భారతీయుడికి గుర్తింపు లభించింది. ధోని విజయం సాధించాలని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, డ్రైవర్లు కోరుకోవడం నేను చూశాను. ధోనిలాగే తన కంపెనీ ఎన్నో విజయాలను సాధించింది. ప్రతిభ, పట్టుదల, కృషి ఉంటే ఆర్థికంగా తక్కువ ఉన్న వారు సైతం ఏదైనా సాధించొచ్చని ధోని నిరూపించారు. ఇన్ఫోసిస్ కూడా అదే విషయాన్ని చాటిచెప్పింది. ఆసక్తికరంగా ధోని పుట్టిన రోజే ఇన్ఫోసిస్‌ కూడా స్థాపించబడింది” అని నారాయణ మూర్తి రాసుకొచ్చారు.

ఇక ధోని మ్యాచ్‌లను చూసి లీడర్ షిప్‌ క్వాలిటీలను నేర్చుకోవచ్చునని ఆయన అన్నారు. ఒక నాయకుడి ముఖ్య బాధ్యత.. లక్ష్యాన్ని పెట్టుకోవడం, దానికి అనుగుణంగా తన టీమ్‌ని తయారు చేయడం. ధోని ఈ విషయంలో చాలా పరిపూర్ణత కలిగిన వారు అని నారాయణ మూర్తి తెలిపారు. ఇక విజయం వచ్చినప్పుడు దాన్ని ధోని అందరితో పంచుకునే విధానానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎంతో ఒత్తిడిలోనూ ధోని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వగలడని అందుకే కెప్టెన్ కూల్ అయ్యారని నారాయణ మూర్తి వెల్లడించారు. ఒక అద్భుతమైన నాయకుడు నిశ్శబ్దంగా ఉంటూ తన పని తీరుతో ప్రత్యర్థిని మట్టికరిపించగలగాలి. ఆట గెలిచినా, గెలవకపోయినా ధోని తన టీమ్‌తో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేవారు అని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఇన్ఫోసిన్ సైతం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ., బలమైన సంస్థగా సాగుతోందని నారాయణ మూర్తి రాసుకొచ్చారు.

Read More:

కార్గిల్‌కి వెళ్లిన మొదటి మహిళా పైలట్‌ గుంజన్ కాదా..!

ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు అలర్ట్‌