
కూతురు అని కూడా చూడకుండా కన్నతల్లే కాలయముడుగా మారిన ఒక షాకింగ్ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సాధారణ మరణం నుండి హత్య ఉదంతంగా మార్చిన కడుగోడి పోలీసులు.. చిన్నారి తల్లి, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయిన ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ జి.ఎమ్. మోహన్‌లపై శనివారం హత్య కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మోహన్‌ను 7 రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకోగా, పరారీలో ఉన్న ప్రియాంక కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దావణగెరెలో ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్న ప్రవీణ్ బసప్ప, ప్రియాంకలకు 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. దాదాపు 17 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో 2025 నవంబర్‌లో తుఫాను రేగింది. బెంగళూరులోని 25 ఎకరాల పిత్రార్జిత భూమి వివాదానికి సంబంధించిన కోర్టు పనుల కోసం ప్రియాంక బెంగళూరు వచ్చింది. ఈ క్రమంలో కాలేజీ రోజుల్లో తన మాజీ ప్రేమికుడు, ప్రస్తుతం రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పుకునే రియల్టర్ జి.ఎమ్. మోహన్‌తో ఆమెకు మళ్లీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ప్రియాంక లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. భర్త ప్రవీణ్‌కు తెలియకుండా డిసెంబర్ చివరి వారంలో కాశీకి వెళ్లి మోహన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా న్యూ ఇయర్ వేడుకల కోసం అతనితో కలిసి దుబాయ్ వెళ్లి విలాసవంతంగా గడిపింది. జనవరిలో తిరిగొచ్చిన ప్రియాంక.. పిల్లలను శాశ్వతంగా దూరం చేస్తానని భర్తను బెదిరించి బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకుంది. ఆ తర్వాత పెద్ద కూతురు తండ్రి వద్దే ఉండిపోగా, ఆరేళ్ల చిన్నారి వెన్నెలను తీసుకుని సీగేహళ్లిలోని ఒక విల్లాలో మోహన్‌తో కలిసి ప్రియాంక సహజీవనం సాగించింది.
మార్చి 24న ప్రియాంక పుట్టినరోజు. ఆ రాత్రి చిన్నారి వెన్నెలకు బిర్యానీ, ఐస్‌క్రీమ్ తినిపించినట్లు ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ప్రియుడు మోహన్‌తో కలిసి కాఫీ షాప్‌నకు వెళ్తూ.. గాఢ నిద్రలో ఉన్న చిన్నారిని కారులోనే వదిలేసి, ఏసీ ఆన్ చేసి వెళ్లినట్లు కథ అల్లింది. అర్ధరాత్రి తిరిగొచ్చిన తర్వాత పాపను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లానని తెలిపింది. కానీ మార్చి 25 ఉదయం చూసేసరికి పాప ఎంతకీ లేవకపోవడంతో వైదేహి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
పాప మరణంపై మొదటి నుండి తండ్రి ప్రవీణ్‌కు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 4న పోలీసుల నుండి అటాప్సీ రిపోర్టును సేకరించిన ప్రవీణ్.. దానిని ఇంగ్లాండ్‌లో చైల్డ్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న తన అక్క డాక్టర్ పూర్ణిమకు పంపాడు. ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్ పూర్ణిమ.. పాప సహజంగా చనిపోలేదని, ఖచ్చితంగా ఏదో గూడుపుఠాణి జరిగిందని తేల్చి చెప్పింది. తమ కొత్త జీవితానికి అడ్డంగా ఉందనే ఉద్దేశంతోనే ప్రియాంక, మోహన్ కలిసి పాపను ఊపిరాడకుండా చేసి లేదా విషమిచ్చి చంపేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ప్రవీణ్ జూన్ 4న కడుగోడి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. వైట్‌ఫీల్డ్ డీసీపీ సైదులు అదావత్ తెలిపిన వివరాల ప్రకారం.. పాప మరణించిన తొలినాళ్లలోనే మోహన్ ముందస్తు బెయిల్ పొందాడు. అయితే అప్పట్లో పూర్తి పోస్ట్‌మార్టం నివేదిక రాలేదని, ప్రాథమికంగా ఊపిరాడకపోవడం వల్లే మరణించినట్లు డాక్టర్లు అనుమానించారని తెలిపారు. రక్తా నమూనాలలో విషపు ఆనవాళ్లు లేకపోవడంతో విసరా శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. ప్రస్తుతం లభించిన వైద్య, ల్యాబ్ ఆధారాలతో పోలీసులు కోర్టును ఆశ్రయించి, మోహన్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయించి అతనిని అరెస్ట్ చేశారు.