
Rainfall Deficit: భారత్‌లో నైరుతి రుతుపవనాల పరిస్థితి ఇటీవలి నెలల్లో గణనీయంగా మెరుగుపడింది. దీంతో ఖరీఫ్ పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు తగ్గుతున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మాక్వైరీ తన నివేదికలో వెల్లడించింది. అయితే వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండకపోవడం కీలక అంశంగా మారిందని పేర్కొంది. మాక్వైరీ అంచనా ప్రకారం.. దేశంలో వర్షపాతం పరిస్థితి “మెరుగుపడుతోంది.. కానీ ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు”. జూన్ 16న 35 శాతంగా ఉన్న సంచిత వర్షపాతం లోటు ఆగస్టు 19 నాటికి 12.6 శాతానికి గణనీయంగా తగ్గింది.
వర్షపాతం మెరుగుపడటంతో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం కూడా పుంజుకుంది. జూన్ చివరి నాటికి గతేడాదితో పోలిస్తే 21 శాతం తక్కువగా ఉన్న మొత్తం ఖరీఫ్ సాగు.. ఆగస్టు 14 నాటికి కేవలం 2 శాతం మాత్రమే తగ్గింది. పంటల వారీగా చూస్తే.. వరి సాగు గతేడాదితో పోలిస్తే 3.7 శాతం, మొక్కజొన్న సాగు 4 శాతం తక్కువగా ఉంది. మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చెరకు, పత్తి సాగు విస్తీర్ణం గతేడాది స్థాయికి దాదాపు చేరుకుంది. ఈ పంటల్లో వ్యత్యాసం సుమారు 1 శాతం లోపే ఉంది. దీంతో ఖరీఫ్ సాగులో మిగిలిన లోటు కొన్ని పంటలకే పరిమితమైందని మాక్వైరీ తెలిపింది. ఇది మొత్తం వ్యవసాయ రంగంపై విస్తృత ప్రభావం చూపే పరిస్థితి లేదని అంచనా వేసింది.
వర్షపాతం లోటును అధిగమించేందుకు జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు కీలకంగా మారాయని మాక్వైరీ పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నీటి నిల్వలు 10 ఏళ్ల సగటు కంటే ఎక్కువగా లేదా దానికి సమీపంలో ఉన్నాయి. వ్యవసాయపరంగా కీలకమైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ జలాశయాల నిల్వలు ఆయా ప్రాంతాల సగటులో సుమారు 80–100 శాతం మేర ఉన్నాయి. దీంతో సాగుకు అవసరమైన నీటి లభ్యతపై ప్రస్తుతం పెద్దగా ఆందోళన అవసరం లేదని నివేదిక సూచిస్తోంది. అయితే బిహార్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం పరిస్థితిని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని మాక్వైరీ హెచ్చరించింది.
మెరుగైన రుతుపవనాలు, ఖరీఫ్ సాగులో స్వల్ప లోటు మాత్రమే ఉండటం, జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు ఉండటం వంటి అంశాలు ఖరీఫ్ పంటల ఉత్పత్తిపై ఉన్న ప్రతికూల ప్రమాదాలను గణనీయంగా తగ్గించాయని మాక్వైరీ తెలిపింది. దీని ప్రభావం ఆహార ద్రవ్యోల్బణంపైనా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. జూన్‌తో పోలిస్తే ఆహార సరఫరా, ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఆందోళనలు తగ్గాయని బ్రోకరేజ్ పేర్కొంది.
అయితే రుతుపవనాల సీజన్ ముగిసే వరకు వర్షపాతం ఏ ప్రాంతాల్లో, ఏ స్థాయిలో కురుస్తుందనేది కీలకంగా మారనుంది. మిగిలిన వర్షపాతం లోటు కారణంగా పంటల తుది దిగుబడులు వర్షాల పంపిణీపై ఆధారపడి ఉంటాయని మాక్వైరీ స్పష్టం చేసింది.