ఓ పార్టీలో ఉంటున్నప్పుడు ఆ పార్టీ గొప్పదనాన్నే కీర్తించాలి తప్ప తప్పొప్పులు చెప్పకూడదు! వందకు వందశాతం ఓడిపోతుందని తెలిసినా గెలిచి తీరతాం అని బీరాలు పలకాలి. అంతేకానీ నిజం మాటాడకూడదు! ఈ లౌక్యం పాపం సురేశ్ గోపీ అనే మలయాళ నటుడికి తెలియదు.. రాజ్యసభ సభ్యుడైన ఈ బీజేపీ నాయకుడు నిజం చెప్పేసి సొంత పార్టీ నేతల నుంచి అక్షింతలు వేయించుకున్నాడు. ఈయన ఏం చెప్పారయ్యా అంటే.. గురువాయుర్, తలసెరీ నియోజకవర్గాలలో యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్- యూడీఎఫ్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సురేశ్ గోపీ మాటలు పార్టీ క్యాడర్‌కు ఒకింత షాక్‌కు గురి చేశాయి. అబ్బే .. సురేశ్ గోపీ వ్యాఖ్యలను పట్టించుకోవలసిన అవసరం లేదని, అది ఆయన సొంత అభిప్రాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ ఒకటికి పదిసార్లు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి గురువాయుర్, తలసెరి నియోజకవర్గాలలో బీజేపీ పోటీ చేయడం లేదు..బీజేపీ అభ్యర్థులు ఎంతో ఉత్సాహంతో నామినేషన్లు వేశారు కానీ అవి తిరస్కరణకు గురయ్యాయి.. గురువాయుర్ నుంచి అడ్వొకెట్ నివేదిత సుబ్రహ్మణ్యం, తలసెరి నుంచి ఎన్.హరిదాస్‌లు బీజేపీ తరఫున నామినేషన్‌లు వేశారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగింది. ఈసారి తప్పకుండా గెలుస్తామని బీజేపీ అధినాయకత్వం భావించింది. కాకపోతే ఆ ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో ఇప్పుడు విజయావకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి..
ఇక సురేశ్‌గోపీ ఆ మాటన్నాడో లేదో కేరళ ముఖ్యమంత్రి విజయన్ .. ‘అదిగో చూశారా… బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. ఎల్‌డీఎఫ్‌ను ఓడించడానికి ఆ రెండు పార్టీలు భుజం భుజం కలుపుతున్నాయి. కాంగ్రెస్, ముస్లింలీగ్‌లతో బీజేపీ లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది’ అంటూ కామెంట్ చేశారు. సురేశ్‌గోపీ పొరపాటునో, పరధ్యానంగానో చేసిన వ్యాఖ్య కాదని విజయన్ అంటున్నారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముల్లప్పళ్లి రామచంద్రన్ మాత్రం నిజం చెప్పినందుకు సురేశ్ గోపీని అభినందించారు. గురువాయుర్ అసెంబ్లీ నుంచి యూడీఎఫ్ తరఫున ముస్లింలీగ్ అభ్యర్థి కె.ఎన్.ఎ ఖాదిర్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడక్కడ బీజేపీ అభ్యర్థి లేరు కాబట్టి సహజంగానే ఆ పార్టీ అభిమానుల్లో కొందరు యూడీఎఫ్‌కు ఓటేస్తారు. ఎల్‌డీఎఫ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరు. అదే సమయంలో డెమొక్రాటిక్ సోషలిస్ట్ జస్టిస్ పార్టీ అభ్యర్థి దిలీప్ నాయర్ మాత్రం తనకు ఓటేయాల్సిందిగా బీజేపీ క్యాడర్‌ను కోరుతున్నారు..ఈ కారణంగానే ఎన్‌డీఏ కూటమిలో డీఎస్‌జేపీ భాగస్వామిగా చేరింది కూడా! ఇక తలసెరి నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఎం.పి.అరవిందాక్షన్ యూడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు. సీపీఎంకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.ఎన్.షంషీర్‌తో తలపడుతున్నారు. క్రితంసారి ఎన్నికల్లో షంషీర్ 34,117 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సురేశ్‌గోపీ జోస్యం నిజమవుతుందో.. లేక మిరాకిల్ ఏమైనా జరుగుతుందో చూడాలి…
మరిన్ని చదవండి ఇక్కడ : Glass Bridge: హాట్ టాపిక్‌గా మారిన చైనా లో మరో అద్భుత కట్టడం…!! తప్పక చూడాల్సిందే… ( వీడియో )
Viral Video: పాముపై ఊరేగిన కప్ప…!! స్నేహితులుగా మారిన ఆగర్భ శత్రువులు… ( వీడియో )
Prison island: సముద్రాల మధ్యలో ఉండే అందమైన ద్వీపం… షాకింగ్ నిజాలు…!! ( వీడియో )