
Char Dham Temples: చార్‌ధామ్ ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2026లో జరిగే యాత్ర సందర్భంగా చార్‌ధామ్ ఆలయాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. చార్‌ధామ్ ఆలయాలు బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలో మొబైల్ ఫోన్లు, కెమెరా నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.
గత సంవత్సరం ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడంతో దర్శన నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 17న రషికేశ్ ట్రాన్సిట్ క్యాంప్ ప్రాంగణంల చార్‌ధామ్ యాత్ర నిర్వహణ, నియంత్రణ సంస్థ గఢ్‌వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే అధ్యక్షతన నిర్వహించి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
భక్తుల భద్రత, ఆలయాల పవిత్రత, అలాగే ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆలయ కమిటీలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు చిత్రీకరించడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు, దర్శన సమయంలో అంతరాయం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు.
ప్రత్యేకించి కేదార్‌నాథ్ వంటి ప్రాంతాల్లో రద్దీ, వాతావరణ మార్పులు వంటి కారణాలతో భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్లతో ఫోటోలు, రీల్స్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే ఆలయాల్లో సోషల్ మీడియా కోసం వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్, రీల్స్ చిత్రీకరణ పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు మొబైల్ ఫోన్లను ఆలయాల బయట ఏర్పాటు చేసిన లాకర్లు లేదా భద్రపరిచే కేంద్రాల్లో ఉంచాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భక్తులందరూ సహకరించి ప్రశాంతమైన, భక్తిమయ వాతావరణంలో దర్శనం చేసుకోవాలని కోరారు. ఈ నిర్ణయంతో ఛార్‌ధామ్ యాత్ర మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.