అతి పిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు ముక్కుపచ్చలారని చిన్నారులు. ఇప్పటికే స్వీడన్‌కు చెందిన గ్రెటా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉద్యమిస్తోంది.
తాజాగా ఆమె బాటలోనే పయనిస్తోంది మన భారతీయ చిన్నారి ఎనిమిదేళ్ల లిసిప్రియ కంజుగం. ఐక్యరాజ్యసమితి వేదికగా తన గళాన్ని వినిపించింది. భావి తరాలను కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తోంది.
మణిపూర్‌కు చెందిన లిసిప్రియ..ఏడేళ్లప్పుడే పర్యావరణ పరిరక్షణకు పోరాటం ప్రారంభించింది. గతేడాది పార్లమెంట్ ఎదుట, ఈ ఏడాది ఇండియా గేట్ వద్ద వేలాది మందితో ఏడు రోజులపాటు గ్రేట్ అక్టోబర్ మార్చ్ నిర్వహించింది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రసంగించింది. ఇప్పటికే వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్, ద ఇండియా పీస్ ప్రైజ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డులను అందుకుంది. ఆమెది దిగువ మధ్యతరగతి కుటుంబమైనా..తల్లిదండ్రులు పూర్తి మద్దతునిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరుగుతున్న నష్టం తనను తీవ్రంగా కలిచివేస్తోందంటోంది లిసిప్రియ. తనలాంటి చిన్నారులు ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారని..దీనికంతటికీ కారణం పర్యావరణ కాలుష్యమేనంటోంది. అందుకే తమను బతకనివ్వాలంటూ భారత ప్రభుత్వం ముందు మూడు డిమాండ్స్ ఉంచింది. జీరో కార్బన్ విడుదలకు చట్టం తీసుకురావాలి. వాతావరణ మార్పులను పాఠ్యాంశంలో చేర్చాలి. ప్రతి విద్యార్ధి మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తూ..వాటి ఆధారంగా డిగ్రీ ఇవ్వాలని అంటోంది. కాలుష్యాన్ని తగ్గించి భూగోళ పరిస్థితిని మెరుగుపరచడమే తన లక్ష్యమంటోంది.