
జామ్‌నగర్: తల్లి ప్రేమకు దూరమై.. పుట్టిన కొద్దిరోజులకే ఒంటరిగా మిగిలిపోయి.. ఇప్పుడు ప్రాణాంతక అనారోగ్యంతో పోరాడుతున్న ఓ ఏనుగు పిల్ల కథ అందరినీ కలచివేస్తోంది. కేరళలో పుట్టిన వెంటనే గుంపు నుంచి విడిపోయిన 18 నెలల ఏనుగు పిల్ల ‘మాయ’ ప్రస్తుతం తీవ్రమైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. నడవలేని స్థితికి చేరుకున్న ‘మాయ’కు మెరుగైన వైద్యం అందించేందుకు కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. అనంత్ అంబానీకి చెందిన వంతార (Vantara) ప్రత్యేక వైద్య బృందం ఇప్పుడు గున్న ఏనుగుకు చికిత్స అందిస్తోంది.
పుట్టినప్పటి నుంచే ‘మాయ’కు కష్టాలు!
2025 ఏప్రిల్ 19న కేరళలోని మలయాత్తూర్ అటవీ ప్రాంతం, కప్రిక్కాడ్ సమీపంలోని నది ఒడ్డున మాయను అటవీ అధికారులు గుర్తించారు. అప్పుడే పుట్టిన ఆ ఏనుగు పిల్లను దాని గుంపు విడిచిపెట్టి వెళ్లిపోయింది. తల్లి పాలు కూడా అందకపోవడంతో మాయ తీవ్ర బలహీనత, డీహైడ్రేషన్‌తో బాధపడింది. అటవీ అధికారులు వెంటనే రక్షించి అభయారణ్యానికి తరలించారు. అక్కడ పశువైద్యుడు డాక్టర్ బినోయ్ సి. బాబు, సంరక్షకుల బృందం ప్రత్యేక శ్రద్ధతో పెంచారు. ముఖ్యంగా నిఖిల్ బాబు అనే సంరక్షకుడితో మాయకు మంచి అనుబంధం ఏర్పడింది.
చిన్న ప్రమాదం.. తీవ్రమైన అనారోగ్యం
2026 జూలైలో ఆడుకుంటూ జారిపడిన మాయ భుజానికి గాయమైంది. అయితే ఆ తర్వాత మాయ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఎముకలు బలహీనపడటంతో రెండు ముందు కాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఛాతీలో ఇన్ఫెక్షన్, ఒత్తిడి కారణంగా శరీరంపై పుండ్లు కూడా వచ్చాయి. చివరకు నిలబడలేని పరిస్థితికి చేరుకుంది. ద్రవ ఆహారంపైనే ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది.
కారుణ్య మరణానికి సిఫార్సు.. చివరి ప్రయత్నంగా వంతార!
మాయ పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 29న వైద్య బృందం కారుణ్య మరణాన్ని సిఫార్సు చేసింది. అయితే కేరళ ప్రధాన వన్యప్రాణి సంరక్షణాధికారి డాక్టర్ పి. పుగళేంది మరో వైద్య అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఏనుగుల వైద్య నిపుణుడు డాక్టర్ కుశాల్ కొన్వర్ శర్మ పరిశీలనలో మాయకు పారాథైరాయిడ్ సంబంధిత సమస్య ఉండవచ్చని, దీనివల్ల ఎముకలు బలహీనపడి ఉండవచ్చని అనుమానించారు. దీంతో మరింత చికిత్స అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
వంతారలో ప్రత్యేక వైద్యం
నవంబర్ 6న మాయను కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్ వంతార పశువైద్య కేంద్రానికి ప్రత్యేక విమానంలో తరలించారు. వైద్య పర్యవేక్షణ, అత్యవసర ప్రాణరక్షణ పరికరాలతో ఈ ప్రయాణం చేపట్టారు. మాయకు సుపరిచితుడైన సంరక్షకుడు నిఖిల్ బాబు కూడా గున్న ఏనుగుతో పాటు వెళ్లారు. వంతారలో మాయకు అధునాతన వైద్య పరీక్షలు, నొప్పి నివారణ చికిత్స, ఎముకల వ్యాధికి సంబంధించిన ప్రత్యేక వైద్యం అందించనున్నారు. వంతార సీఈఓ వివాన్ కరానీ మాట్లాడుతూ.. మాయ తన జీవితంలోని ప్రతి రోజూ పోరాడిందని, ఇప్పుడు తాము పోరాడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
మాయ కోలుకుంటుందా?
ప్రస్తుతం మాయ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఎముకలు తీవ్రంగా బలహీనపడటానికి అసలు కారణం ఏమిటనే దానిపై వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. చికిత్సకు మాయ శరీరం ఎలా స్పందిస్తుందో.. దానిబట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. మాయ ఆరోగ్యం మెరుగుపడితే తిరిగి కేరళలోని అభయారణ్యానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న మాయ ఇప్పుడు మరోసారి జీవితం కోసం పోరాడుతోంది. మాయ త్వరగా కోలుకోవాలని జంతు ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..