
గాల్వన్ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి.. ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు చర్చలు కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన మేజర్ -జనరల్ స్థాయికి చెందిన అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సోమవారం రాత్రి లడక్‌లోని గాల్వన్ లోయలో ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కల్నల్ సహా.. 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. మరోవైపు అటు చైనాకు చెందిన సైనికులు కూడా దాదాపు 43 మంది మరణించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో.. మేజర్-జనరల్ స్థాయిలో చర్చలు కొనసాగడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా శుక్రవారం సాయంత్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల నేతలకు పీఎంవో కార్యాలయం నుంచి ఆహ్వానం పంపించారు.